Nov 16,2023 21:53

ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన ప్రణాళిక, ప్రమాణాల ప్రకారం సజావుగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ డాక్టర కతికా శుక్లా తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ ప్రగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పాల్గొని కాకినాడ జిల్లాలో సంక్షిప్త సవరణ కింద చేపట్టిన చర్యలను సిఇఒకు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకూ అందిన ఫారమ్‌-6,7,8 దరఖాస్తులన్నిటిపై పరిశీలన, పరిష్కారాలను త్వరితగతిన నిర్వహిస్తున్నామని ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీల నుంచి అందిన అభ్యంతరాల పైన పరిశీలన జరిపి వాస్తవమైన వాటిపై అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డిఆర్‌ఒ కె.శ్రీధరరెడ్డి, డిటిలు యం.జగన్నాథం, రామ్‌ కుమార్‌, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.