Mar 12,2023 22:16

ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌: ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం పుట్టపర్తి లోని చిన్నపల్లి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల పోలింగ్‌ సరళిని నిఘా నీడలో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వీడియో చిత్రీకరణ, వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. జిల్లాలో 86 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, పట్టభద్రులకు సంబంధించి 43,310 మంది ఓటర్లు ఉన్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 3348 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌ పి రాహుల్‌ దేవ్‌ సింగ్‌, జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌ ఎన్నికల సామాగ్రి తరలింపు పక్రియను పరిశీలించారు. ఎస్‌పి మాట్లాడుతూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. డిఆర్‌ఒకొండయ్య పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ విధానం గురించి డెమో ద్వారా ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి రామకృష్ణ ప్రసాద్‌, డిఎస్‌పి యశ్వంత్‌, ఆర్‌డిఒ భాగ్యరేఖ, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
సర్వం సిద్ధం : సోమవారం జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో 11 రూట్లను ఏర్పాటు చేశామన్నారు. పట్టభద్రుల ఎన్నికల కోసం 54 పోలింగ్‌ కేంద్రాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 32 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 13 సాధారణ, 11 సమస్యాత్మక, 8 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలలో 20 సాధారణ, 18 సమస్యాత్మక, 16 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ ఎన్నికలకు 46 మంది ప్రిసైడింగ్‌ అధికారులను, 47 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులను నియమించామన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు 60 మంది ప్రిసైడింగ్‌ అధికారులను ఏర్పాటు చేశామన్నారు. 108 మంది పరిశీలకులను నియమించామని, ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ క్యాస్టింగ్‌ ఫోటోగ్రఫీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల అధికారులకు ఎన్నికల సామాగ్రిని అందజేశామని, ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.