సిసిరోడ్డు పనులు ప్రారంభం
ప్రజాశక్తి-సీతారామపురం : స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమీప రహదారి నుండి బెస్త కాలనీకి పోవు రహదారి సుమారు 170 మీటర్లు నూతన సిసిరోడ్డు నిర్మాణ పనులను బుధవారం సర్పంచ్ కొడవటికంటి భాగ్యమ్మ ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా బెస్ట్ కాలనీవాసులు పడుతున్న రహదారి సమస్యకు పరిష్కారం దొరికింది. చిన్నపాటి వర్షం పడినా బురదలో నడవలేక నరకయాతన అనుభవిస్తున్నామని సర్పంచ్ భాగ్యమ్మ చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టి పనులు జరపడం ఎంతో సంతోషంగా ఉందని కాలనీవాసులు తెలిపారు. ఆర్థికంగా పంచాయతీ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అప్పులు చేసి మరీ రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో సర్పంచ్‌కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాగ్యమ్మ మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పనులను చేస్తున్నామని ప్రభుత్వం కూడా తమకు సహకరించి నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తూ ఉంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నామని ఆ ఉద్దేశంతోనే అభివృద్ధి పనులను చేస్తున్నామన్నారు. త్వరలో పంచాయతీలో కొన్నిచోట్ల మరో కొన్ని సిసి రోడ్ల పనులను చేపడతామన్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులను పిఆర్ ఎఇ తిరుమలయ్య పరిశీలించి రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.










