Feb 05,2023 21:17

సాగులో ఉన్న లిటిల్‌ రెడ్‌ గులాబీలను చూపుతున్న మహిళా రైతు

 రామసముద్రం : 'లిటిల్‌ రెడ్‌' గులాబి పూల సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. గతంలో చాలా రకాల ఉద్యాన పంటలు పండిస్తూ నష్టాల ఉబిలోకి చిక్కుకొని రైతులు అప్పులపాలయ్యారు. ఏ పంట సాగు చేసినా కనీస పెట్టుబడులు దక్కక కష్టాల కడలిలో చిక్కుకున్నారు. మండలంలోని నారిగానిపల్లి, చెంబకూరు, కాప్పల్లి, ఆర్‌.నడింపల్లి, ఎలువనెల్లూరు, రామసముద్రం, వూలపాడు, చోక్కాండ్లపల్లి, మినికి, మాలేనత్తం, అరికెల, కుదురుచీమనపల్లి పంచాయతీలో కొందరు రైతులు వినూత్న పద్ధతులతో నిత్యం సిరులు కురిపిస్తున్న లిటిల్‌ రెడ్‌, బటన్‌ రోజా, మెరాబుల్‌ రకానికి చెందిన పూల సాగు చేసి నిత్యం ఆదాయం పొందుతున్నారు. మండల వ్యాప్తంగా 200 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ప్రభుత్వం తరపున చిన్న సన్నకారు రైతులకు ఎకరాకు సబ్సిడీ ద్వారా రూ.6 వేలు, పెద్ద రైతులకు ఎకరాకు రూ.4 వేలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా రైతులు లిటిల్‌ రెడ్‌ గులాబీ పంటలు వేసి ముందుకు సాగుతున్నారు.
స్థానిక మార్కెట్‌ సౌకర్యం లేక ఇబ్బందులు
మండల ప్రాంతాల్లో పూల కొనుగోలుకు ప్రత్యేక మార్కెట్‌ సదుపాయం కల్పిస్తే తాము పండించిన పూలకు సరైన ధర లభించే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్‌ యార్డ్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇంటిల్లపాది ఉపాధి
నాకు రెండెకరాల పొలం ఉంది. బెంగుళూరు నర్సరీ నుంచి 6 వేల సెంటు గులాబీ మొక్కలను తీసుక వచ్చాము. ఒక్కో గులాబీ మొక్కకు రూ.25 ఖర్చయింది. దిగుమతి చేసుకున్న 6 వేల మొక్కలను రెండెకరాల్లో నాటాము. డ్రిప్‌ ద్వారా గులాబీ మొక్కలకు నీరందిస్తున్నాం. ఇంటిల్లిపాదీ పొలాన్ని కంటికి రెప్పలా కాపాడుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టార. కుటుంబ సభ్యులమందరం స్వయం ఉపాధి కల్పించుకున్నాం.
-అరుణ, ఆదర్శ రైతు, ఎగువలంభంవారిపల్లి
ఎకరానికి 30 కిలోల వరకు దిగుబడి
మొక్కలు నాటిన 3 నెలలకు గులాబీలు చేతికి వచ్చాయి. ప్రతి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా కలసి పూలను మదనపల్లె ప్రాంతాల్లో విక్రయాలు జరుపుతాము. కోసిన గులాబీలను రైతు నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లి హోల్‌సేల్‌ వ్యాపారులకు విక్రయాలు జరుపుతున్నాం. కిలో గులాబీ రూ.100 చొప్పున వ్యాపారులకు విక్రయించారు. ఎకరం తోట నుంచి నిత్యం 30 కిలోల వరకు పూల దిగుబడి వస్తోంది. - రెడ్డెప్ప, రైతు, నారిగానిపల్లి
మెలుకువలు పాటిస్తే అధిక లాభాలు
మండలం పరిధిలో గత ఏడాది కాలంగా పలువురు రైతులు తమ పొలాల్లో ఎకరం, రెండు ఎకరాల విస్తీర్ణంలో గులాబీ పూల తోటలను సాగుచేస్తూ ఉద్యాన పంటల సాగును విస్తరించారు. మొదట్లో ఎకరానికి 25 నుంచి 30 కిలోల వరకు పంటను ఇస్తాయి. ఒకసారి గులాబీ పంటను సాగు చేస్తే ఏడు నుంచి పదేళ్ల వరకు రైతుకు గులాబీలు అందిస్తూ పంట చేతికి వస్తూనే ఉంటుంది. పంట సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.
- ఈశ్వర్‌ ప్రసాద్‌ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి