Apr 22,2023 20:29

సిరులిచ్చే చిరుధాన్యాలు

రాయచోటి : మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొర్రాల పాయసం, రాగి జావ లాంటి పేర్లు జనాల నాలుకల మీద తిరుగుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు సార్ధకత చేకూరుతోంది. గటకే తిన్నామో.. గంజే తాగామో.. అని మాట వరుసకు అంటుంటాం. పేదతిండి అని చెప్పడానికి వాడే ఉపమానం అది. నిజానికది గరీబు తిండి కాదు. నిఖార్సయిన తిండి. నిండైన తిండి. గంభీరమైన తిండి. శ్రీమంతుల తిండి. ఇంకా చెప్పాలంటే-చిరుధాన్యాలకు మించిన పౌష్టికాహారం-ఈ భూమండలం మీదనే లేదు. అందుకే ఒకప్పటి పచ్చజొన్నల గట్క మళ్లీ రారమ్మని పిలుస్తోంది. ఆనాటి రాగిజావ తిరిగి కళ్లముందు కదలాడుతోంది. కనుమరుగైన సామపాశం మళ్లీ సాహో అంటోంది. మచ్చుకైనా కనిపించని సజ్జ మలీదలు మిర్రిమిర్రి చూస్తున్నాయి. ఈ తరానికే తెలియని నూనె పోలెలు నున్నగా కవ్విస్తున్నాయి. ప్రాభవం కోల్పోయిన చిరుధాన్యాలు చిరునవ్వులు రువ్వుతున్నాయి. సన్నబియ్యం, బాసుమతి రైస్‌ తినడమే స్టేటస్‌ అనుకునే రోజులు పోతున్నాయి. దంపుడు బియ్యం ఎంత రేటున్నా సరే కొంటున్నారు. రాగి అంబలి తాగడానికి క్యూ కడుతున్నారు. ఎండాకాలం సామబియ్యం తింటే చలువ అని జనానికి అర్ధమైంది. చలికాలం కొర్రబువ్వ తినాలని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది.
చిరుధాన్యాల సాగుతో రైతు ఇంట సిరులు కురువనున్నాయి. జిల్లాలోని నేలలు కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సామలు, అరికెలు, ఊదల పంటల సాగుకు అనుకూలం కావడంతో రబీలో 1,520 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 3,500 ఎకరాల్లో సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేఉ్తన్నారు. అతి తక్కువ వర్షపాతం నమోదైనా పంట చేతికొస్తుంది. జిల్లాలో చిరుధాన్యాల సాగుపై అధిక శాతం రైతులు ఆసక్తిని చూపుతున్నారు. ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. చిరుధాన్యాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కిలో రూ.60 నుంచి రూ.70 వరకు ధర పలుకుతుండగా, క్వింటాలుకు రూ.6వేల నుంచి రూ.7 వేల వరకు వస్తుంది. ఎకరాకు దాదాపు రూ.70 వేలకుపైగా ఆదాయం సమకూరనున్నది. రైతుల్లో అవగాహన పెంచి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచేలా వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నది.
కొర్రకు మంచి గిరాకీ ఉంది
కొర్రలకు మంచి గిరాకీ ఉండటంతో 20 గుంటల పొలంలో చేశాను. ఇతర పంటల కన్నా చిరుధాన్యాల సాగులో మంచి లాభాలున్నాయి. పంట కంకి దశకు చేరుకుంటుంది. మార్కెట్‌లో కిలో కొర్రలు రూ.80-90 అడుగుతున్నారు. తక్కువ పెట్టుబడి, శ్రమ కూడా తక్కువగానే ఉంటుంది. పంట దిగుబడి బాగా ఉంటే మంచి లాభాలే వస్తాయి.
- రామిరెడ్డి, రైతు, చెన్నముక్కపల్లి, రాయచోటి.
3,500 ఎకరాలకు సాగు పెంపు
జిల్లా వ్యాప్తంగా సుమారు 1520 ఎకరాల్లో పలు రకాల ధాన్యాలు సాగు చేస్తున్నారు. రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు పండిస్తున్నారు. మార్కెట్‌లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్‌ ఉంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం లభిస్తున్నది. ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పించి జిల్లాలో ఈ ధాన్యాల సాగు విస్తీర్ణం 3500 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
- ఉమామహేశ్వరమ్మ, జెడి అన్నమయ్య.
పెట్టుబడి తక్కువ...దిగుబడి ఎక్కువ
చిరుధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాల సాగు తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. తక్కువ నీటి వినియోగంతో ఈ పంటలు పండుతాయి. పంటల సాగులో ఎప్పటికప్పుడూ రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. వరి, మక్కజొన్న, కూరగాయల పంటల కన్నా చిరుధాన్యాల సాగులోనే మంచి దిగుబడులు, లాభాలు పొందవచ్చు.
- గిరీష, కలెక్టర్‌, అన్నమయ్య.
- రాయచోటి ప్రాంతంలో సాగు చేసిన కొర్ర పంట