Jan 18,2023 22:25

సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌

         అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే విధంగా తీసుకొచ్చిన సిపిఎస్‌ను రద్దు చేసేంత వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులను కలుపుకుని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని యాదవ కళ్యాణమండపంలో యుటిఎఫ్‌ పశ్చిమ రాయలసీమ జిల్లాలు కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయం సిపిఎస్‌ అని చెబుతోందన్నారు. ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. సిపిఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేయాల్సిందే అన్నారు. సిపిఎస్‌కు ప్రత్యామ్నాయం జిపిఎస్‌ కాదని ఓపీఎస్‌ మాత్రమే అన్నారు. సిపిఎస్‌ అంతం యుటిఎఫ్‌ పంతంగా పోరాడుతామన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం అన్యాయంగా ఉందన్నారు. దేశంలో బెంగాల్లో ఇప్పటికీ పాత పెన్షన్‌ విధానమే అమలు చేస్తోందన్నారు. తాజాగా రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తున్నాయని, జార్ఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాలు తాము కూడా పాత పెన్షన్‌ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించాయని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో కూడా పాత పెన్షన్‌ విధానం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానం అమలుకు ప్రయత్నించకపోవడం చాలా బాధాకరం అన్నారు. గడచిన సంవత్సర కాలం నుంచి 30 వేల ఉపాధ్యాయ పదోన్నతులు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పదోన్నతులు ఇవ్వకపోగా వర్క్‌ అడ్జస్‌మెంట్‌ పేరుతో ఉపాధ్యాయులను వేధించడం ప్రభుత్వానికి తగదన్నారు. వెంటనే ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతలు ఇచ్చి, బదిలీలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇక నూతన విద్యావిధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని ఆపాలన్నారు. విలీనం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని తెలిపారు. పాఠశాలల కుదింపు జరుగుతోందని, దీని వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోయి పాఠశాల వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. మార్చిలో జరిగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలను విడనాడాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన రెండు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా, నాగమణి, కోటేశ్వరప్ప, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, ఆరు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్‌, జబీర్‌, మహేష్‌ బాబు, పివి.ప్రసాద్‌, సుధాకర్‌, ఎల్లప్ప, జయరాజు, గోవిందరాజులు, లింగమయ్య, నాగేంద్ర పాల్గొన్నారు.