అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ సిపిఎస్ రద్దుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్ర డిమాండ్ చేశారు. బుధవారం నాడు యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో తాడిమర్రి, బత్తలపల్లి, కనగానపల్లి మండల శాఖల నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్ర హాజరై ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి యుటిఎఫ్ పనిచేస్తోందన్నారు. విద్యారంగం సంక్షోభంలో నెట్టబడిందని దీన్ని అధిగమించడానికి ఉద్యమాల ద్వారా సాధిస్తామని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను కొనసాగించేందుకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎస్ రద్దు కోరుతూ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం బత్తలపల్లి, కనగానపల్లి, తాడిమర్రి మండల యుటిఎఫ్ శాఖల నిర్మాణం చేయడం జరిగింది. యుటిఎఫ్ బత్తలపల్లి మండల శాఖ అధ్యక్షులుగా ఆర్.రామాంజనేయులు నాయక్, ప్రధాన కార్యదర్శిగా టి.మహబూబ్ బాషా, తాడిమర్రి మండల శాఖ అధ్యక్షులుగా కె.నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శిగా డి.శామ్యూల్ విక్టర్, కనగానపల్లి మండల శాఖ అధ్యక్షులుగా బి.వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శిగా ఈ.ఓబులేసులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా యుటిఎఫ్ నాయకులు చంద్రశేఖర్, రమేష్, రామాంజనేయులు, ఓబులేష్, వెంకటరాముడు, నాగభూషణ, గంగాధర్ పాల్గొన్నారు.










