నినాదాలు చేస్తున్న యూనియన్ నాయకులు
సిపిఎస్, జిపిఎస్ వద్దు.. ఒపిఎస్ ముద్దు
-ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్
ప్రజాశక్తి-నెల్లూరు:ఫ్యాఫ్టో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ఫ్యోఫ్టో, ఎఫ్‌ఓఆర్‌టిఒ, ఎపిసిపిఎస్‌ఈఎ, ఎపిసిపిఎస్‌యుఎస్ సంఘాలు సంయుక్తంగా నగరంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఫ్యోఫ్టో జిల్లా చైర్మన్ ఎ.సురేంద్ర రెడ్డి అధ్యక్షతన,సెక్రటరీ జనరల్ చిట్టేటి రమేష్ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఉద్యోగ, ఉపాద్యాయులకు ఇచ్చిన హామిని తుంగలో తొక్కిందన్నారు. ఎటువంటి భరోసా లేని,ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాద్యాయులు అందరూ వ్యతిరేఖకిస్తున్నప్పటికీ ఉద్యోగుల పై బలవంతంగా జిపియస్ విధానాన్ని రుద్దాలని ప్రయత్నిస్తుందన్నారు. జిల్లా సెక్రటరీ జనరల్ చిట్టేటి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం జిపియస్ ను ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేసి బలవంతంగా అమలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర పరిశీలకులు యస్ చిరంజీవి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని రివర్స్ విధానాలు తీసుకు వచ్చి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తుందని,ఇప్పటికైన ప్రభుత్వం జిపియస్ విధానాన్ని విరమించుకోని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరో రాష్ట్ర పరిశీలకులు యన్.వి.రమణయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు తలొగ్గి ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని,చాలా రాష్ట్రాలు ఇప్పటికే సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నాయన్నారు. ఒక వేళ అలా చేయకుండా బలవంతంగా జిపియస్ ను తీసుకువస్తే ఉద్యోగులు గత ప్రభుత్వాలకు బుద్ధి చెప్పినట్లు ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెబుతారని తెలియజేశారు. అనంతరం ఫ్యాఫ్టో జిల్లా నాయకులు జాయింట్ కలెక్టర్ కూర్మనాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఫ్యాఫ్టో నాయకులు,జి.రాజమనోహర్, సి.హెచ్.హజరత్,బొచ్చు డెవిడ్ చినబాబు,ఇ.ధన రాజ్, అచ్చయ్య,దశరధరాములు,పిచ్చి బాబు,వేణుగోపాల్,మాల్యాద్రి, కష్ణారెడ్డి, ప్రసాద్, పెంచలయ్య, శివరామి రెడ్డి, సుబ్బారావు,ఖాజా రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.










