కొచ్చి : సిపిఎం మహాసభల సందర్భంగా జరపతలపెట్టిన మతతత్వ వ్యతిరేక సదస్సుకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి సభ్యులు కెవి థామస్ హాజరుకానున్నారు. మహాసభలో మతతత్వానికి వ్యతిరేకంగా జరిగే జాతీయ సెమినార్‌లో థామస్ పాల్గొంటారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అభ్యంతరపెట్టినప్పటికీ, బిజెపికి వ్యతిరేకంగా జరిగే సదస్సుకు హాజరై మాట్లాడటం తన బాధ్యతని ఆయన పేర్కొన్నారు. 'సిపిఎం మహాసభలో మతతత్వానికి వ్యతిరేకంగా జాతీయ సదస్సు జరుగుతోంది. నేను పాల్గొని బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడతాను. మతతత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలు ఏకం కావాలి' అని థామస్ మీడియాకు చెప్పారు. సెమినార్‌కు హాజరుకావాలనే తన నిర్ణయాన్ని సోనియాగాంధీ, తారిక్ అన్వర్‌లకు కూడా తెలియజేసినట్లు చెప్పారు. 'ఇతర రాష్ట్రాల్లో సిపిఎం, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. కేరళలో మాత్రం ఎందుకు దూరంగా ఉండాలి' అని థామస్ ప్రశ్నించారు.










