సిపిఎం జాతీయ మహాసభలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన కేరళ... ఫ్లాగ్ డే నిర్వహణ
తిరువనంతపురం : వచ్చే నెల 6 నుండి 10 వరకు జరగబోయే సిపిఎం 23వ జాతీయ మహా సభలకు అత్యంత సుందర రాష్ట్రం కేరళ ఆతిధ్యమిస్తోంది. కన్నూర్‌లో ఈ మహాసభలు జరగనున్నాయి. ఎర్ర జెండా రెపరెపలతో, బ్యానర్లతో రాష్ట్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా, మార్చి 29న కయ్యూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లాగ్ డేను నిర్వహించారు. కన్నూర్‌లోని మహా సభల నిర్వహణ కార్యాలయం వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకఅష్ణన్‌తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు ఇపి జయరాజన్ కూడా ఈ జెండాను ఆవిష్కరించారు. తిరువనంతపురం ఎకెజి సెంటర్ వద్ద సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అనతలవట్టం ఆనందన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్ని జిల్లాలు, స్థానిక, ప్రాంతీయ, శాఖ కేంద్రాల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. కన్నూర్‌లో పార్టీ సభ్యులు, మద్దతు దారులు .. తమ ఇళ్ల ముందు పార్టీ జెండాలను ఎగురవేశారు. కన్నూర్ జిల్లా కమిటీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్ జెండాను ఎగురవేశారు.











