సింగపేటలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని సింగపేట గ్రామంలో టిడిపి నాయకులు సోమవారం ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టి విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్‌పిటిసి బీద గిరిధర్, బండి శ్రీనివాసులురెడ్డి, అరగల రమణయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆకాశాన్ని అంటుతున్నాయని ఎద్దేవా చేశారు. రోడ్లను మరమ్మతులు చేయకపోవడం కారణంగా రాష్ట్రంలో ప్రమాదాలు జరిగి ఇప్పటికీ 5000 మంది మృతి చెందారని విచారం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆయన బాదుడే బాదుడంటూ చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారని ప్రస్తుతం 3 రెట్లు అధికంగా విద్యుత్ బిల్లులు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రజలు ఇకనైనా మేల్కొని జగన్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని హెచ్చరించారు. కార్యక్రమంలో బుల్లా కృష్ణారెడ్డి, షేక్ నజీర్‌బాషా, పెనుమల్లి శ్రీనివాసులురెడ్డి, చెంతాటి రాజశేఖర్ బాబు, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.










