Jan 26,2022 07:19

ప్రజాశక్తి ప్రతినిధి - తిరువనంతపురం :  కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిల్వర్‌ లైన్‌ సెమీ హైస్పీడ్‌ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు, మీడియా మ్యానిపులేటర్లు ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం కేరళ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది.2021 అసెంబ్లీ ఎన్నికల్లో . ఎల్‌డిఎఫ్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఇది ఒకటి.. దక్షిణాన ఉన్న తిరువనంతపురం నుంచి ఉత్తరాన ఆ కొసలో ఉన్న కాసరగోడ్‌కు రైలులో వెళ్లాలంటే ఇప్పుడు 16గంటల సమయం పడుతుంది. అదే సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చితే నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రతి యాభై కి.మీ.కు ఒక స్టాప్‌ చొప్పున మొత్తం 11 స్టాపులు ఉంటాయి. కిలోమీటర్‌కు రూ.120 కోట్లు చొప్పున ఖర్చు అవుతున్నా భరించి 500 కి.మీ.కు పైగా పొడవైన ఈ ప్రాజెక్టు చేపట్టడానికి ప్రభుత్వం సంకల్పించుకోడానికి ఇదే ముఖ్య కారణం.

సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు రిపోర్టులోని వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయం 63, 940 కోట్లు. ఇందులో రైల్వేస్‌కు చెందిన భూమి విలువ రూ.975 కోట్లు, కేంద్రం వాటా 2,150 కోట్లు మినహాయిస్తే రాష్ట్రం తన వంతుగా రు.3,225 కోట్లు పెట్టుబడి పెడుతుంది. మిగతా రూ. 4,252 కోట్లు పబ్లిక్‌ షేర్ల ద్వారా సేకరించడం జరుగుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవడం జరుగుతుంది.

ఎవరైనా బిజినెస్‌ పని మీద ఎర్నాకుళం నుంచి తిరువనంతపురానికి వస్తే పని ముగించుకుని వెళ్లేందుకు కనీసం రెండు రోజులు పడుతుంది.ప్రయాణ సమయాన్ని గంటన్నర, రెండు గంటలు తగ్గించగలిగినా ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగిరపరచవచ్చనే దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు. మన సమయంలో ఎక్కువ భాగం ఇలా ప్రయాణాల్లో వృథా కాకుండా నివారించాలంటే పీక్‌ అవర్స్‌లో ఇటువంటి సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ల అవసరం ఉంది. జపాన్‌లో ఒసాకా- టోక్యో మధ్య ప్రతి మూడు నిమిషాలకు ఒక హైస్సీడ్‌ లేదా బులెట్‌ ట్రైన్‌ నడుస్తుంది. కేరళ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. రాష్ట్ర జిడిపి ఏడాదికేడాది పెరుగుతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నేడు ప్రణాళికలు వేయకపోతే 2030, లేదా 2040 లేదా 2050 నాటికి కూడా కేరళలో ఈ రోజు మాదిరిగానే ప్రయాణానికి 10, 12 గంటలు వెచ్చించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.

ప్రతిపాదిత సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు కింద 9,314 భవనాలు తొలగించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల భవనాలకు జరిగే నష్టాన్ని వీలున్నంతమేరకు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఇళ్లను చెక్కుచెదరకుండా ఒక చోట నుంచి మరో చోటుకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేటప్పుడు ప్రస్తుత భూ సేకరణ, పునరావాస చట్టాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సేకరించే భూమికి మార్కెట్‌ రేటు కన్నా రెండు రెట్లు అధికంగా చెల్లించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు అధికంగా పరిహారం చెల్లిస్తారు.. ఇందుకోసం రూ. 13, 625 కోట్లు , ఇళ్లకు పరిహారంగా రూ. 4,460 కోట్లు కేటాయించడం జరిగింది.

సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా కొచువెలి నుంచి చెంగనూర్‌ దాకా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూ సేకరణకు హడ్కో నుంచి రూ. 3,000 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణాత్మకమైన విమర్శలను స్వీకరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే. అయితే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈఅభివృద్ధి ప్రాజెక్టును చేపట్టాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షం యత్నిస్తే అందుకు తలగ్గేది లేదని ముఖ్యమంత్రి ఇస్పటికే స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును పక్కదారి పట్టించే ఎటువంటి యత్నమైనా భావితరాలకు తీరని నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును అడ్డుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని ముఖ్యమంత్రి చెప్పారు.