సీతారామపురాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : సీతారామపురం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘం జిల్లా నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని బసినేనిపల్లి గ్రామంలో పలువురు రైతు నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. మర్రివూట్ల రిజర్వాయర్ దగ్గర నుండి మండలంలో ఉన్న అన్ని చెరువు కట్టలపై పెరిగిన చెట్లను తొలగించి చెరువు కట్టలను కాపాడాలన్నారు. జిల్లాలో ప్రధానంగా సిజెఐఎఫ్‌ఎస్ భూములను ప్రభుత్వ భూములుగా మార్చిన మండలం సీతారామపురం అని, అలాంటి లబ్ధిదారులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములను సాగుదారులకు హక్కులు కల్పించలన్నారు. మర్రివూట్ల రిజర్వాయర్, స్వామి చెరువు లీకేజీలను అరికట్టి కాలువలు రిపేర్ చేసి సాగు తాగునీరు కల్పించాలన్నారు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ దక్షిణ కాలువ మీద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సీతారామపురం మండలంలోని అన్ని చెరువులకు సాగునీరు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం పంచిన పేద భూములలో ఉపాధి హామీ పనులు చేపించి భూమిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిపై అక్టోబర్ 3వ తేదీన బసినేనిపల్లి పంచాయతీ నుండి నెల్లూరు వరకు పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కాబట్టి మండల ప్రజలందరూ పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి కల్లూరు వెంకటేశ్వర రెడ్డి, సిపిఎం నాయకులు కోడే రమణయ్య, రైతు నాయకులు బద్వేలు రమణారెడ్డి, నారాయణరెడ్డి, కానాల హాజరత్తయ్య, రాజారత్నం, భైరవ, చిన్నపరెడ్డి, వెంకటేశ్వర్లు, చిన్న మౌలా సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.










