Jan 13,2023 16:53

సాగులో ఉన్న బంగాళాదుంప పంట

ప్రజాశక్తి - రామసముద్రం: శీతాకాలంలో బంగాళదుంప సేద్యానికి అనువైన వాతావరణం ఉంటుంది. మండలంలోని రైతులు బంగాళదుంప పంటలు అత్యధికంగా వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్‌ ఆఖరు నుంచి ఫిబ్రవరి రెండో పక్షం వరకు బంగాళాదుంప సాగు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుందని, స్పల్పకాలంలో పండించే పంట కాబట్టి ఈ సంవత్సరం దాదాపుగా వంద ఎకరాల్లో రైతులు బంగాళా దుంప సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోని కోలారు, మాలూరు, చింతామణి, శ్రీనివాసపురం ప్రాంతాలనుండి విత్తనాలు 50 కిలోల విత్తనం బస్తా రూ.1100 కొనుగోలు చేశారు. ఈ దుంప రకాల్లో కెఎఫ్‌, కుఫ్రీ పేరిట లాలిమ, బాద్‌షా, చంద్రముఖి, సింధుర్‌, తదితర రకాలు ఎన్నుకున్నారు. దుంప విత్తనాలు త్వరగా మొలకెత్తటానికి (నిద్రావస్థను తొలగించడానికి) శీతల గిడ్డంగుల నిల్వ నుండి తీసిన విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు.
అనుకూల వాతావరణం : బంగాళదుంప సాగుకు ఈ ప్రాంతం చల్లని వాతావరణం కాబట్టి పగటి ఉష్ణోగ్రత 32 సెల్సియస్‌, రాత్రిళ్లు 15-20 సెల్సియస్‌ మధ్య చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు ఈ సీజన్లో బంగాళా దుంప సేద్యం వైపు మొగ్గుచూపుతున్నారు. నీటి పారుదల గల ఇసుక లేకుంటే ఎర్ర గరప నేలలు, కండ నేలలు అనుకూలంగా ఉంటాయి. విల్ట్‌ నెలలు అనుకూలించక రైతులు నష్టపోతారు. 110 రోజుల్లో పంటకొచ్చే కుఫ్రీ సింధూర్‌ రకం రామసముద్రం మండలాల్లో పండించటానికి, నిల్వకు అనువైంది. ఇది లేట్‌ బ్లైట్‌ తెగులును తట్టుకుంటుంది.
దిగుబడులు : దుంప సాగులో ఎకరాకు 9-10 టన్నుల దిగుబడినిస్తుంది. రైతుకు ఒక ఎకరం పంట వేసుకోవడానికి విత్తనాలు 8 నుండి 10 బస్తాలు అవసరమని. ఒక్కో బస్తకి 20 నుండి 30 బస్తాలు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం అనుకూలిస్తే దుంప రైతులు లాభల బాటలో సాగుతారు. బెంగళూరు, చెన్నై, పాండిచేరి , వేలూరు, హైదరాబాద్‌, లాంటి బహిరంగ మార్కెట్లో ఒక్కో బస్తా ధర రూ.800 నుండి రూ.వెయ్యి రేటు పలుకుతుంది.