న్యూఢిల్లీ : రాష్ట్ర మిలిటెన్సీ ఉద్యమంపై జనవరి 8న ప్రచురితమైన ఒక ఆర్టికల్‌కు సంబంధించి మణిపూర్ ప్రభుత్వం ఇద్దరు సీనియర్ జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు నమోదు చేసింది. ఆ ఇద్దరు జర్నలిస్ట్‌లు ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నారంటూ... చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద వారిపై కేసు నమోదు చేసింది. సుమోటుగా తీసుకున్న మణిపూర్ పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 'మణిపురి న్యూస్ పోర్టల్' ఎడిటర్ ఇన్ చీఫ్ ధీరేన్ సదోక్పామ్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పోవోజెల్ చౌబాలను అదుపులోకి తీసుకున్నారు. చైబాను అరెస్ట్ చేసినట్లు దక్షిణ ఇంఫాల్ ఎస్‌పి ధ్రువీకరించారు. అయితే సదోక్పామ్ అరెస్ట్‌పై ఆయన స్పందించలేదు. 'రివల్యూషనరీ జర్నీ ఇన్‌ఎ మెస్' అనే పేరుతో ఈ ఆర్టికల్‌ను ఎం జాయ్ లువాంగ్ రాశారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును కూడా చేర్చారు. 1960ల నుండి సాయుధ వేర్పాటువాద ఉద్యమాన్ని నిర్వహిస్తున్న పలు సాయుధ బలగాల తీరును విమర్శనాత్మకంగా ఈ ఆర్టికల్‌లో వివరించారు. సాయుధ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వలసరాజ్యాల చట్టంగా అభివర్ణించారు. మెయిల్‌లో వచ్చిన ఈ ఆర్టికల్ విశ్లేషణాత్మంగా ఉండటంతో.. ప్రచురించాలని నిర్ణయించుకున్నామని ఎడిటర్ ఇన్ చీఫ్ ధీరేన్ సదోక్పామ్ అన్నారు. గతంలో కూడా ప్రభుత్వాల, పోలీసుల విమర్శనాత్మక వ్యూహాలను ప్రచురించామని అన్నారు.
కాగా, జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇదే మొదటిసారి కాదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతోంది. జర్నలిస్టులు మాత్రమే కాదు.. ప్రభుత్వాల తీరును విమర్శిస్తూ.. ట్వీట్‌లు చేసిన ఎవరిపైనైనా ఇదే చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. అధికార పార్టీని విమర్శించిన వారిపై ఈ కేసులు ప్రయోగించడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఫేస్‌బుక్‌లో ఒక వివాదాస్పదమైన ఇమేజ్‌ను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ.. గత ఏడాది జులైలో సామాజిక కార్యకర్త ఎండ్రో లిచోంబామ్‌పై కూడా దేశద్రోహం కేసు నమోదు చేశారు. 2018లో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, ప్రధాని మోడీలను విమర్శిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారంటూ 'ఫ్రంటెయినర్ మణిపూర్' అసోసియేట్ ఎడిటర్ కిశోర్‌చంద్ర వాంగ్ఖేమ్‌పై కూడా దేశద్రోహం కేసు నమోదు చేయడంతో పాటు జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు. నాలుగు నెలల పాటు నిర్బంధం విధించారు. 2020లో వాంగ్ఖేమ్‌ను మరోసారి దేశద్రోహం కేసు కింద రెండు నెలలు జైలు శిక్ష విధించారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి అభిప్రాయాలతో కూడిన ఒక కథనాన్ని అనువదించిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ రీసెర్చ్ స్కాలర్ మహ్మద్ చింగిజ్ ఖాన్, గౌహతి విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మద్ ఇంతియాజ్ ఖాన్‌లపై కూడా గతేడాది ఇదే అభియోగం మోపారు.










