Feb 09,2022 07:03

   'మహిళల గౌరవానికి, భద్రతకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఈ విషయంలో రాజీ పడేదే లేదు' అంటూ గత ఏడాది జూన్‌లో దిశ యాప్‌ను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటనను వెక్కిరించేలా రాష్ట్రంలో ఒకే రోజు రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది, కోవిడ్‌-19 వారియర్స్‌గా నిలిచిన ఆశా వర్కర్లపై పోలీసుల దాష్టీకం. రెండవది నెల్లూరు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల యూనిఫామ్‌ కొలతలకు పురుష టైలర్లను వినియోగించడం. ఈ రెండింటిలోనూ మహిళల పట్ల పోలీసుల తీరు అత్యంత అభ్యంతరకరమే కాదు, ఆక్షేపణీయం కూడా. మహిళా ఉద్యోగుల హక్కులు, వారి గౌరవాన్ని కాపాడాల్సిన రక్షక భటులే వాటికి భంగం కలిగించేలా వ్యవహరించడం సిగ్గుచేటు. ఆశావర్కర్లు న్యాయసమ్మతమైన తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచేందుకు కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్తుంటే వారిని అడ్డుకుని, రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లడం దారుణం. మహిళా పోలీసులకు మగ పోలీసులు కూడా తోడై ఆశావర్కర్లపై బలప్రయోగం చేయడం వల్ల కొందరికి గాయాలయ్యాయి. కోవిడ్‌-19 మహమ్మారిపై పోరులో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రేయింబవళ్లు సేవలందించిన హెల్త్‌ వర్కర్లు తమకు కనీస వేతనం ఇవ్వాలని, కరోనాకు బలైన హెల్త్‌ వర్కర్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కోవిడ్‌ విధుల్లో ఉన్న వారికి బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ తరువాత రూ.10 వేలకు తగ్గకుండా పింఛను సదుపాయం కల్పించాలని, ఎన్‌హెచ్‌ఎం వర్కర్ల సర్వీసులు రెగ్యులరైజ్‌ చేయాలని, కోవిడ్‌తో చనిపోయిన హెల్త్‌ వర్కర్‌కు చెందిన కుటుంబంలో ఒకరికి ఆ ఉద్యోగం ఇవ్వాలని, ఆరోగ్య రంగాన్ని, ఆసుపత్రులను ప్రైవేటీకరించొద్దని కోరుతున్నారు. వారు లేవనెత్తిన ఈ డిమాండ్లు అత్యంత న్యాయసమ్మతమైనవి. కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా ఆశావర్కర్లు అందించిన సేవలను ప్రశంసిస్తూ వారిపై పూల జల్లు కురిపించి, సన్మానాలు చేసి ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? చాలీచాలని వేతనాలతో ఇబ్బందిపడుతున్న హెల్త్‌ వర్కర్ల గురించి పట్టించుకోనక్కర్లేదా? నెలల తరబడి వేతన బకాయిలు పెండింగ్‌లో పెట్టడంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది. రిస్క్‌తో కూడిన విధుల్లో ఉన్న వీరికి ఎలాంటి సామాజిక భద్రత కానీ, ఉద్యోగ భద్రత కానీ లేదు. ఇటువంటి స్థితిలో కడుపు మండి రోడ్డెక్కితే వారి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అందుకు భిన్నంగా వారిపైకి పోలీసులను ఉసిగొల్పడం దారుణం. నాయకుల గృహ నిర్బంధాలు, అరెస్టులు, అడుగడుగునా బారికేడ్లు వీటన్నిటిని అధిగమించి కాకినాడలోని కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్లేందుకు యత్నించిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించివేశాయి. పోలీసుల అమానుష చర్యపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
    మహిళా పోలీసు యూనిఫాం కొలతల విషయంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించడం పట్ల మహిళా, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరికి రాష్ట్ర మహిళా కమిషన్‌ సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మహిళల శరీర కొలతలను పురుష కానిస్టేబుళ్ల సమక్షంలో జెంట్స్‌ టైలర్‌ తీసుకోవడం శుద్ధ తప్పు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోడానికి బదులు ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడం దీనిని బయటపెట్టిన ఫొటోగ్రాఫర్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక వైపు మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చామని, దీనిని అందరూ వినియోగించుకోవాలని చెప్పిన పోలీసు అధికారులు, తమ మహిళా పోలీసులకు జరిగిన అన్యాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యారు. గత నెలలో చిత్తూరులో దళిత మహిళను పోలీస్‌ కస్టడీలో చిత్రహింసలు పెట్టిన వైనం బయటకొచ్చినప్పుడు దానిని కప్పిపుచ్చేందుకు యత్నించి భంగపడ్డారు. అయినా, ఆ ఘటన నుంచి పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. కాకినాడ, నెల్లూరులో పోలీసుల దాష్టీకంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముంది. ఇందుకు బాధ్యులెవరో గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.