ప్రజాశక్తి -కందుకూరు :రాష్ట్ర అభివద్ధిని గాలికి వదిలేసి, ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిన జీవో నెంబర్1 ను వ్యతిరేకిస్తూ కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం తెల్లవారుజామున భోగిమంటలు వేసి జీవో కాపీలను తగలబెట్టారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే సైకో దిగిపోవాల్సిందేనని, మళ్లీ సైకిల్ అధికారంలోకి రావాలని అన్నారు. వైసీపీ నేతలు తప్ప మరెవ్వరూ ర్యాలీలు సభలు పెట్టకూడదన్న కుట్రతోనే జీవోను తీసుకువచ్చారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలు అనుమతి తీసుకుంటున్నా పోలీసులు ర్యాలీకి అనుమతించడం లేదని, అదే వైసిపి నేతలు ఎలాంటి అనుమతి తీసుకోకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా పోలీసులు అదనపు భద్రత కల్పిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు జగన్ పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిని, అక్రమాలని ఎవరు ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సైకో లక్షణాలున్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని, ప్రజలు పార్టీకి మద్దతు ఇవ్వాలని నాగేశ్వరరావు కోరారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు దివి శివరాంతో పాటు పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రూరల్ అధ్యక్షుడు నార్నే రోశయ్య, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెండ్ల వెంకట సుబ్బారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, ఉపాధ్యక్షుడు వడ్డేళ్ళ రవిచంద్ర, పట్టణ పార్టీ నాయకులు రత్తయ్య, పొన్నగంటి వెంకట్రావు, ముప్పవరపు వేణు, కల్లూరి శైలజ, సరిత తదితరులు పాల్గొన్నారు.










