Oct 17,2022 23:31

ప్రజాశక్తి-అవనిగడ్డ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 20వ తేదీన అవనిగడ్డలో పర్యటించనున్న నేపథ్యంలో కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఎస్‌.రంజిత్‌ బాషా సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ బాబుతో కలిసి మండల పరిధిలోని వేకనూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్‌ నిర్మాణ పనులను, అవనిగడ్డలో ఏర్పాటు చేస్తున్న సభ ప్రాంగణం పనులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని, వీటన్నింటిని ఆ జాబితా నుండి తొలగించేందుకు ఈనెల 20న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అవనిగడ్డలో జరిగే బహిరంగ సభలో క్లియరెన్స్‌ పత్రాలు ఇస్తారని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్‌ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.