May 03,2023 21:30

ఫొటో : ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

సిఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 12వ తేదీ కావలిలో పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డి పర్యటించి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత జెడ్‌పి ఉన్నత పాఠశాల క్రీడామైదానాన్ని సందర్శించి, హెలిప్యాడ్‌, బ్యారికేడింగ్‌ ఏర్పాట్లపై ఆర్‌అండ్‌బి, పోలీసు శాఖ, విద్యుత్‌శాఖ అధికారులతో చర్చించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మినీ క్రీడా స్టేడియం స్థలాన్ని సందర్శించి బహిరంగసభ ఏర్పాట్లపై కలెక్టర్‌ హరి నారాయణన్‌ అధికారులతో చర్చించారు. తదుపరి వాహన పార్కింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి జవహర్‌ భారతి విక్రమసింహపురి విశ్వవిద్యాలయ కళాశాలకు సంబంధించిన స్థలం, ఆర్‌.టి.సి డిపోకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పి హైమవతి, కావలి ఆర్‌.డి.ఒ. వి.కె.శీనానాయక్‌, జెడ్‌పి సి.ఇ.ఒ. చిరంజీవి, ఆర్‌అండ్‌బి, ఎస్‌పిడిసిఎల్‌ ఎస్‌ఇలు వెంకటసుబ్బయ్య, గంగాధర్‌, డిటిసి చందర్‌, డివిజనల్‌ అభివృద్ధి అధికారి ఎస్‌.కనక దుర్గా భవాని, కావలి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, తహశీల్దార్‌ మాధవరెడ్డి, పోలీసు శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.