మాజీ సిఎం హరీష్ రావత్‌కూ తప్పని ఓటమి
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో మరోసారి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బిజెపి 48 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 18 స్థానాల్లోనూ, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ విజయం సాధించారు. 2000లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2017 ఎన్నికల్లో గెలుపొందిన 57 స్థానాలతో పోలిస్తే తొమ్మిది స్థానాలు తగ్గాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం, కరోనా సమయంలో హరిద్వార్‌లో కుంభమేళాను నిర్వహించడం, నకిలీ కరోనా పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ధర్మ సంసద్‌లో ముస్లింలపై విషం గక్కడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే సిఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. రాష్ట్ర సమస్యల కన్నా, జాతీయ అంశాలనే ఉత్తరాఖండ్ ఓటర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఖతిమా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ధామిపై కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రి 6,951 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికలకంటే 8 స్థానాల్లో విజయం సాధించినా అనుకున్న లక్ష్యాన్ని కాంగ్రెస్ అందుకోలేకపోయింది. పార్టీని నడిపించిన సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా విజయం సాధించకపోవడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది










