న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పు ఊహాగానాలపై ఆ రాష్ట్ర సిఎం భూపేష్ బాగెల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతోనే తాను సిఎంగా ప్రమాణ స్వీకారం చేశానని, అదేవిధంగా సిఎం మార్పు అనే అంశంపై కూడా వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, వేరొకరిని సిఎం చేయాలని అనుకున్నప్పుడు అది జరుగుతుందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో ఇటువంటి మార్పులు సహజమేనని, ఇదే సమయంలో చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు నాలుగింట మూడొంతుల మెజారిటీ ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నడుమ భూపేష్ బాగెల్ ఆదివారం ఢిల్లీలోని 10 జనపథ్‌లోని సోనియా నివాసంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరిగినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రెండున్నరేళ్ల తర్వాత సిఎంను మార్చేందుకు 2018, డిసెంబర్‌లో చేసుకున్న రోటేషన్ ఫార్ములా ఒప్పందాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గౌరవించాలని ప్రస్తుత భూపేష్ కేబినెట్‌లో ఆరోగ్య మంత్రిగా ఉన్న టిఎస్ సింగ్ దియో కోరుతున్న నేపథ్యంలో సిఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది. ప్రియాంకతో భేటీ అనంతరం భూపేష్ ఎఐసిసి చత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జి పిఎల్.పునియాతో సమావేశమయ్యారు. సిఎం మార్పునకు ఎటువంటి రొటేషన్ ప్లాన్ లేదని ఆయన ఒక వార్తాసంస్థతో చెప్పడం గమనార్హం.










