న్యూఢిల్లీ : వైసిపిపై ఆ పార్టీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణరాజు తన విమర్శలను ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం కూడా పార్టీ వ్యతిరేక నిర్ణయమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా! అని సందేహాన్ని వెలిబుచ్చారు. ''ఎపిలో దేవాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తున్నానని నేను చెప్పడం వైసిపి సిద్ధాంతాలకు వ్యతిరేకమా? నేను వెల్లడిస్తున్న అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? నేనేమైనా తప్పు చేశానా?'' అని ప్రశ్నించారు. తనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌కు కారణమేంటో వైసిపి నేతలు చెప్పాలని అన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను చేసిన తప్పేంటో కూడా తెలపాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేయాలని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.










