Jan 30,2023 21:47

ఫొటో : మాట్లాడుతున్న మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి

సిఎం చొరవతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు
ప్రజాశక్తి-ఉదయగిరి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో ఉదయగిరికి అగ్రికల్చర్‌ కళాశాల ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రభుత్వ అగ్రికల్చర్‌ కళాశాలలో ఏర్పాటు చేయనున్న మాజీమంత్రి గౌతమ్‌ రెడ్డి మెమోరియల్‌ స్మృతివనానికి సంబంధించిన ఆర్కిటిక్‌ ఇంజనీర్లతో కళాశాల ప్రాంగణం పరిశీలించి ఎంజిఆర్‌ ఘాట్‌ వద్ద ఏర్పాటుకు ఆర్కిటెక్‌ ఇంజనీర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో యూనివర్సిటీగా కూడా రూపాంతరం చెందడానికి ఎంతోకాలం పట్టదని, ఈ ప్రాంతంలో ఉన్న చిన్న, సన్న కారు రైతులకు యూనివర్సిటీ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరానుందన్నారు. అదేవిధంగా గోదావరి నీళ్లు కూడా శ్రీశైలం మీదుగా ఉదయగిరికి చేరే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో వెలిగొండ కెనాల్‌ పూర్తిగా వస్తుందని ముఖ్యమంత్రి ఎంతో చొరవతో పనులు పూర్తి చేస్తున్నారన్నారు.
ప్రస్తుతం ఉదయగిరికి దగ్గరలో మూడు జాతీయ రహదారులు ఉన్నాయని, కొంత దూరంలో మరో జాతీయ రహదారి కూడా ఉందని నూతనంగా మంజూరైన కావలి నుంచి సీతారాంపురం జాతీయ రహదారి, ఉదయగిరిని కలుపుకుంటూ వెళితే ఉదయగిరికి మహర్దశ పట్టడం రహదారుల పరంగా కూడలి ప్రాంతంగా ఏర్పాటు కావడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు కూడా చురుకుగా సాగుతున్నాయని ప్రకాశం జిల్లా కనిగిరి వింజమూరును కలుపుకుంటూ ఆత్మకూరు మీదుగా నిర్మాణం జరుగుతుందని ఈ ప్రాంతానికి సులభమైన మార్గాలు ఏర్పడనున్నాయని తెలిపారు. గౌతమ్‌ రెడ్డి మెమోరియల్‌ స్మృతివనం నిర్మాణం కోసం ప్రముఖ ఆర్కిటెక్‌ ముంబై నుంచి రాహుల్‌ మల్హోత్రా, అమెరికా నుంచి రాబర్ట్‌ వచ్చారని తెలిపారు. స్మృతివనం నిర్మాణ పనులు నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ డిజైన్‌ చేస్తున్న ఢిల్లీబాబు ఆధ్వర్యంలో జరగనున్నట్లు తెలిపారు. రూ.2.50 కోట్ల అంచనాతో నిర్మించనున్న గౌతమ్‌రెడ్డి మెమోరియల్‌ స్మృతివనం ఏర్పాట్లపై ముందుగా ఇక్కడ పరిస్థితులను ఆర్కిటెక్‌ బృందానికి చూపించినట్లు తెలిపారు. అతి త్వరలో స్మృతివనం ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ ప్రాంతానికి తలమానికంగా ఉండే విధంగా ఇంజనీర్లు రూపకల్పన చేయనున్నారన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రభుత్వ అగ్రికల్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌తో వారి బృందంతో మాట్లాడినప్పుడు తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఈ ప్రాంతంలో ఇలాంటి కాలేజీ మంజూరు కావటం ఎంతో అదష్టంతో కూడుకున్న పని అని అయితే యూనివర్సిటీగా రూపాంతరం చెందటానికి కూడా ఎంతో సమయం పట్టదని వారు తెలిపారు. స్మృతి వనం నిర్మాణం పూర్తయితే వచ్చే మాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ద్వారా ప్రారంభించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్కిటెక్‌ ఇంజనీర్ల బృందం రాబర్ట్‌ మల్హోత్ర, తులసి, అగ్రికల్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కరుణాసాగర్‌ రెడ్డి, జెడ్‌పి కోఆప్షన్‌మెంబర్‌ గాజుల తాజుద్దీన్‌, వింజమూరు, దుత్తలూరు జెడ్‌పిటిసిలు గణపం బాలకృష్ణారెడ్డి, లెక్కల లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు.