Oct 18,2022 23:06

  • పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్‌

ప్రజాశక్తి - అవనిగడ్డ : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌కు అసలు తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించుకునే దమ్ముందా అని రాష్ట్ర గహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. ఈనెల 20న అవనిగడ్డలో జరిగే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ ముందు తన పార్టీ పోటీ గురించి స్పష్టత ఇవ్వాలన్నారు. జనసేన పార్టీ సిఎం అభ్యర్థిగా పోటీలో ఉంటారో లేక చంద్రబాబు చంకలో దూరిపోతారో తేల్చి చెప్పాలన్నారు. అభిమానులు ''మన పవన్‌ సిఎం'' అంటున్నారని, మరి పవన్‌ సిఎం అవుతాడో లేక చంద్రబాబుకు చెంచాగిరి చేస్తాడో చెప్పాలన్నారు. 175 స్థానాల్లో పోటీ చేస్తావా లేక చంద్రబాబుకు అమ్ముడుపోతావా అని నిలదీశారు. ఈ విషయాన్ని తేల్చి మంగళగిరిలో ఉంటారో, మాయాబజార్లో ఉంటారో స్పష్టం చేయాలన్నారు. 175 మంది అభ్యర్థులు లేని జనసేన, 60 స్థానాల్లో అభ్యర్థులు లేరని చెబుతున్న టిడిపి అసలు ముందు ముసుగులు తీసి బయటకు రావాలని సవాల్‌ విసిరారు. ఈసారి కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా వైసిపి సంపూర్ణ విజయాన్ని సాధిస్తుందని, ఇంచు కూడా కదపలేరని అన్నారు.
సిఎం సభ ఏర్పాట్ల పరిశీలన
20న అవనిగడ్డలో జరిగే సిఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం మంత్రి జోగి రమేష్‌, కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎంఎల్‌ఎ సింహాద్రి రమేష్‌ బాబు, ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్‌, ఎంఎల్‌సి తలశిల రఘురాం, ఎస్‌పి జాషువా పరిశీలించారు. అనంతరం డిగ్రీ కళాశాలలోని మన టీవీ భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి సంబంధిత రైతులకు పట్టాలివ్వాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంతో బాధిత రైతు కుటుంబాల్లో ముందే దీపావళి వచ్చిందన్నారు. కలెక్టర్‌ రంజిత్‌ బాషా మాట్లాడుతూ సభలో స్పందన అర్జీలు తీసుకోవడానికి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందుగా వేకనూరులో ఏర్పాటు చేస్తున్న సిఎం హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని కలెక్టర్‌, ఎస్‌పి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెసి మహేష్‌ కుమార్‌ రావిరాల, డిపిఒ వెంకటేశ్వర్లు, డిఇఒ తాహెరా సుల్తానా, ఆర్‌డిఒ కిషోర్‌, వైసిపి యువ నాయకులు సింహాద్రి వికాస్‌, కడపకొల్లు చైతన్య తదితరులు పాల్గొన్నారు.
భారీ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని వేకనూరు గ్రామ సమీపంలోని ఒఎన్‌జిసి డ్రిల్లింగ్‌ సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్‌ నుండి రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి ప్రయాణించే 6 కిలోమీటర్ల మేర బారీగేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అవనిగడ్డ ప్రధాన రహదారులకు ఇరువైపులా బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రహదారులకు మరమ్మతులు చేయడంతోపాటు 20న వాహనాలేవి పులిగడ్డ నుండి అవనిగడ్డ వైపు రాకుండా పులిగడ్డ వద్ద ఎత్తిపోతల పథకం కరకట్ట మీదుగా కాల్వ గట్టు మీద నుండి ప్రయాణించేలా రహదారికి మరమ్మతులు చేస్తున్నారు. కోడూరు వైపు నుంచి వచ్చే వాహనాలను కొత్తపేట వంతెన సమీపంలో అశ్వరావుపాలెం వైపు మళ్లించి అవనిగడ్డ మీదగా బస్టాండ్‌ వైపు, నాగాలంక వైపు వెళ్లే విధంగా, స్టేట్‌ బ్యాంకు మీదుగా అవనిగడ్డ వచ్చేవిధంగా ఆ రహదారికి మరమ్మతులు చేస్తున్నారు.