సిడ్నీ : సిడ్నీలో డెల్టా వైరస్ విజృంభిస్తోంది. సోమవారం 112 డెల్టా వైరస్ కేసులు రికార్డవగా, ఆదివారం నాటి కేసుల కన్నా 45 శాతం పెరిగాయని అధికారులు తెలిపారు. గతేడాది లాక్‌డౌన్‌తో మొదటి వేవ్‌ను అరికట్టినప్పటికీ.. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి అధికంగా ఉందని అన్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నట్లు న్యూసౌత్ వేల్స్ అధికారి గ్లాడిస్ బెరెజిక్లియన్ చెప్పారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తిలో స్వల్ప తగ్గుదల ఉందని, ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని అన్నారు. ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టావైరస్ ప్రభావంతో జూన్ మధ్య వారం నాటికి కేసుల సంఖ్య పెరిగిందని.. గత వారం ఒక కరోనా మృతి కేసు నమోదైనట్లు వెల్లడించారు. జూన్ 26 వరకు లాక్‌డౌన్ అమలులో ఉందని, శుక్రవారం నుండి స్టే ఎట్ హోమ్ ఆదేశాలను పొడిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. విక్టోరియా రాష్ట్రం సరిహద్దులను మూసివేసింది. ఏడాది చివరి వరకు ఆస్ట్రేలియా -సింగపూర్ మధ్య ప్రయాణాలను నిలిపివేసినట్లు తెలిపారు. సిడ్నీలో తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, 120 ఏళ్లలో అత్యంత ఘోరమైన ఆరోగ్య సంక్షోభం ఇదేనని అస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ అధికారి బౌటెల్ అన్నారు. జాతీయ స్థూల జాతీయోత్పత్తిలో 32 శాతం వాటా ఉన్న న్యూసౌత్‌వేల్స్‌లో డేల్టా వేరియంట్ కేసులు అధికంగా ఉన్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ హెచ్‌ఎస్‌బిసి తెలిపింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సమస్యాత్మకంగా మారిందని అన్నారు. ప్రధాని స్కాట్ మారిసన్ మరిన్ని వ్యాక్సిన్ డోసులను కొనుగోలు దారుల నుండి సేకరించడంలో విఫలమయ్యారంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ అంచనా ప్రకారం.. దేశ జనాభాలో కేవలం 17.8 శాతం మంది మాత్రమే తగిన మోతాదులను తీసుకున్నట్లు పేర్కొంది. బ్రిటన్‌లో 60.4 శాతం ఉండగా, అమెరికాలో 52.2 శాతం ఉందని తెలిపింది.










