ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : సిఐటియు 17వ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేశులు పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభలకు సంబందించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు బెంగళూరులో సిఐటియు అఖిలభారత మహాసభలు జరుగుతున్నాయన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. 5వ రోజు బెంగళూరు నగరంలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నారన్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు. రైల్వే లాంటి బలమైన ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేయాలని చూస్తున్నారన్నారు. తద్వారా కార్మికులను కష్టాల్లో నెట్టాలని చూస్తున్నాడని విమర్శించారు. అందుకే దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించడానికి కార్మికుల పక్షాన పోరాటాలు చేయడానికి ఈ మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. ఈ మహాసభల్లో కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జెడ్పీ శ్రీనివాసులు, కోశాధికారి సాంబశివ,నాయకులు లక్ష్మీనారాయణ, బాబావలి, రామకృష్ణ, గౌస్‌లాజం, పైపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.










