సిఐటియు మహాసభల జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : సిఐటియు 17వ అఖిలభారత జయప్రదం చేయాలని జిల్లా సిఐటియు అధ్యక్షులు టివివి ప్రసాద్ పిలుపునిచ్చారు. మండలంలోని ఇందుకూరుపేట ఆటో స్టాండ్ దగ్గర స్టాండ్ గౌరవ అధ్యక్షులు చాన్‌బాషా ఆధ్వర్యంలో సిఐటియు 17వ అఖిల భారత మహాసభలు జనవరి 18 నుండి 22 తేదీ వరకు జరుగుతున్న సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల పోరాడే సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో లేబర్ కోడ్స్ తీసుకుని వచ్చిందని, ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత కనీస వేతనం కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి సైతం నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారని జిఒ నెంబర్ 1 ద్వారా బ్రిటీష్ కాలం నాటి చట్టాలను తీసుకొని వచ్చి ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంభిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బెంగళూరులో జనవరి 18 నుంచి జరిగే అఖిల భారత మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు. జనవరి 22వ తేదీన బెంగళూరు మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నెల్లూరు ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు రాజా, మండల ఆటో యూనియన్ నాయకులు చాన్‌బాషా, వెంకయ్య, నరసింహ మనోహర్, బర్రి ప్రసాద్, మండల సిపిఎం నాయకులు కోటేశ్వరరావు, కోనేటి వెంకయ్య, వేణు, లీగల్ అడ్వైజర్ శ్యామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










