Dec 24,2022 20:10

సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌, రామాంజులు

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌హొ: ఈ నెల 22, 23వ తేదీల్లో రెండు రోజుల పాటు రాయచోటిలో నిర్వహించిన సిఐటియు అన్నమయ్య జిల్లా మహాసభల సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలు విజయవంతం చేసినందుకు కార్మికులకు, ప్రజలకు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కె. సుబ్బరావమ్మ, ఎం. బాలకాశి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శనివారం స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకూ కార్మికుల శ్రమను దోచుకుంటోందని వాపోయారు. ఉద్యోగ, కార్మికుల పట్ల వివక్షత చూపుతూ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని పేర్కొన్నారు. కార్పొరేట్ల కమీషన్ల కోసం పనిచేస్తూ కార్మికుల మీద అక్రమ కేసులు, నిర్బంధాలు చేస్తున్నారని వాపోయారు. మొదటి రోజు ర్యాలీ బహిరంగ సభకు 1600 మంది పాల్గొన్నారని, రెండవ రోజు 250 మందితో ప్రతినిధులసభలో జిల్లా అభివద్దికి పలు రకాల తీర్మానాలు చేసి వాటి అమలు కోసం ప్రభుత్వాల మీద ఆందోళన రూపంలో ఒత్తిడి తెస్తామన్నారు. మహాసభలకు సహకరించిన దాతలకు , పోలీస్‌, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక.. సిఐటియు అన్నమయ్య జిల్లా కమిటీ అధ్యక్షులుగా సి.హెచ్‌. చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శిగా ఎ. రామాంజులు, కోశాధికారిగా హరిశర్మతోపాటు 16 మంది ఆఫీస్‌ బేరర్స్‌, 33 మంది జిల్లా కమిటీ సభ్యులు మొత్తం 48 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.