నగరంలో జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు
సిఐటియు జెండా ఆవిష్కరణ
నెల్లూరు :ఈ నెల18 నుండి 22 వరకు బెంగుళూరులో జరుగనున్న సి.ఐ.టి.యు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఆత్మకూరు బస్టాండ్ వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్న ఈ తరుణంలో జరుగుతున్న సిఐటియు అఖిలభారత మహాసభలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. గడచిన మూడు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గంపై వివిధ రూపాల్లో జరిగిన దాడులను, వాటిని ఎదుర్కొనేందుకు కార్మిక వర్గం చేసిన పోరాటాలను సమీక్షించుకుని రానున్న మూడేళ్ల కాలంలో జరగబోయే పోరాటాలకు ఈ మహాసభలు దిశా నిర్దేశం చేయనున్నందున ఈ మహాసభలకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన తెలిపారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా సమస్యలపై ఈ మహాసభల్లో అనేక తీర్మానాలు చేయనున్నారని, వ్యాపారం పేరుతో ప్రకతి సంపదను దోచుకునే విధానాలకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకై జరగబోయే పోరాటాలకు ఈ మహాసభ కార్యరూపం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సూర్యనారాయణ, సిఐటియు నగర ఆఫీస్ బేరర్స్ బి. రాంబాబు, పి.సుధాకర్, నగర కమిటీ సభ్యులు . అంకయ్య, చెంచులు, వి. రవికుమార్, సుబ్బారెడ్డి, రమేష్, రత్తయ్య, నాగూర్, మురళి, వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.










