'సహకారం‘పై జోక్యం రాజ్యాంగ ఉల్లంఘనే! .. అది రాష్ట్ర పరిధిలోని అంశం..ప్రధాని మోడీకి పవార్ లేఖ
న్యూఢిల్లీ : సహకార వ్యవస్థ రాష్ట్ర జాబితాలోని అంశమని, అందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చూస్తే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంపై లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసిన పవార్, సహకార బ్యాంకింగ్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశమని, సుప్రీంకోర్టు గత తీర్పుల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని పేర్నొన్నారు. మరోవైపు ప్రధాని మోడీని ఆయన నివాసంలో శరద్‌పవార్ కలిశారు. దాదాపు గంటపాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో సహకార మంత్రిత్వశాఖపై పవార్ మోడీ వద్ద అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఎన్‌సిపి వర్గాలు తెలిపాయి. అదేవిధంగా రైతుల సమస్యలను కూడా ప్రస్తావించారని పేర్కొన్నాయి. ఎన్‌సిపి నేత, మహారాష్ట్ర మంత్రి నవాల్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వచ్చిన అభ్యర్థనలను ప్రధాని పరిశీలిస్తారని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందు సహకార శాఖ ఏర్పాటుపై పవార్ ఒక సందర్భంలో మాట్లాడుతూ సహకార రంగానికి సంబంధించి మహారాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు తీసుకొచ్చిందని, రాష్ట్రం రూపొందించిన చట్టాల్లో జోక్యం చేసుకునేందుకు కేంద్రానికి ఎటువంటి హక్కు లేదని పేర్కొన్నారు. శుక్రవారం నాడు పవార్‌తో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్ కూడా విడివిడిగా సమావేశమయ్యారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై రాజ్‌నాథ్ చర్చించారని, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున ప్రతిపక్ష నేతలను కలవడంలో భాగంగా గోయల్ భేటీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.










