ప్రజాశక్తి-శ్రీకాకుళం : జిల్లాలోని ప్రభుత్వ శాఖలు కార్మిక శాఖకు చెల్లించాల్సిన సెస్ బకాయిలను తక్షణమే చెల్లించేలా సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి అన్నారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్, వెల్ఫేర్ సెస్ యాక్టు, వెల్ఫేర్ సెస్ రూల్స్‌పై జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశం ఆర్‌డిఒ బి.శాంతి అధ్యక్షతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై చట్టాల్లోని నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర భవన నిర్మాణాలు, కట్టడాల్లో ప్రభుత్వానికి ఒక శాతం సెస్ చెల్లించాల్సి ఉన్నా, కొన్ని శాఖలు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. సెస్ చెల్లించని వారు అపరాధ రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో రూ.1,12,47,496 సెస్ చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.49,10,654 చెల్లించినట్లు వివరించారు. మిగిలిన బకాయిలను వెంటనే చెల్లించేలా అధికారులు దృష్టిసారించాలన్నారు.కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్.డి.వి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రభుత్వేతర భవన నిర్మాణాలు, ఇతర కట్టడాలన్నీ నమోదు కావాల్సి ఉందన్నారు. జిల్లాలో చాలా నిర్మాణాలున్నా నాలుగు వేల భవనాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ప్రతి కట్టడంలో ఉపయోగించే కార్మికుల్లో వారి సంక్షేమం కోసం ఒక శాతం సెస్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులూ నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.70 లక్షల మంది మాత్రమే నమోదయ్యారని, వీరితోపాటు 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉపాధి హామీ కూలీలు నమోదు చేసుకోవాలని సూచించారు. వీరంతా ఐదేళ్లకు రూ.110 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఇందుకు డ్వామా ఎపిడిలు, ఎంపిడిఒలు, సంబంధిత అధికారులు ఇందుకు సహకరించాలని కోరారు. బకాయిలను ఇదివరకే చెల్లించిన అధికారులు చలానా ప్రతులను తమకు అందజేయాలని, చెల్లించని వారు తక్షణమే చెల్లించి అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఎపిఐఐసి మేనేజర్ బి.రామకృష్ణ, సుడా ప్లానింగ్ అధికారి టి.జి రామ్మోహన్, జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు పి.వి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.










