ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: సరైన చికిత్సలు అందించడం ద్వారా సెరిబ్రల్ పాల్సీ రోగులకు సక్రమంగా నడిచేందుకు అవకాశం కల్పించవచ్చని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గా నాగరాజు తెలిపారు. వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే పురస్కరించుకుని గురువారం సూర్యారావుపేటలోని అను ఆసుపత్రిలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గా నాగరాజు మాట్లాడుతూ మెదడులోని కణజాలం దెబ్బతినడం వల్ల సెరిబ్రల్ పాల్సీ సమస్య ఏర్పడవచ్చన్నారు. సెరిబ్రల్ పాల్సీ మానసిక సమస్య కాదని, శారీరక రుగ్మత మాత్రమేనని తెలిపారు. ఈ సమస్య కారణంగా పిల్లల ఎదుగుదల ఆలస్యమవుతుందని, కాళ్లు, చేతులకు సంబంధించిన కండరాలు బిగుసుకుపోయి పిల్లలు నడవడలేకపోతారని చెప్పారు. రెండేళ్ల వయసు దాటినా పిల్లలు నడవలేకపోతే సెరిబ్రల్ పాల్సీ కారణం కావచ్చని, కండరాల సమతుల్యత లోపించిన కారణంగా కాళ్లు, చేతులు వంకరపోవడం, గూని సమస్య తలెత్తడం గుర్తించవచ్చని తెలిపారు. సెరిబ్రల్ పాల్సీ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స ఆరంభిస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. దెబ్బతిన్న మెదడు కణజాలాన్ని సరిచేయడం సాధ్యం కాకపోయినప్పటికీ ఫిజియోథెరపీ, బొటాక్స్ ఇంజెక్షన్లు, ఆపరేషన్ల ద్వారా సెరిబ్రల్ పాల్సీ సమస్యకు చికిత్స అందించవచ్చని చెప్పారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సల ద్వారా రోగుల జీవన శైలిని మార్చవచ్చన్నారు. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న పిల్లలకు ఫిజియోథెరపీ చక్కగా ఉపయోగపడుతుందని, కండరాలను సక్రమంగా పనిచేయించడంలోనూ, ఆపరేషన్ తర్వాత రోగి సక్రమంగా నడిచేందుకు ఫిజియోథెరపీ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు బొటాక్స్ ఇంజెక్షన్ సత్ఫలితాలను ఇస్తుందని, బొటాక్ ఇంజెక్షన్ సహాయంతో బిగుసుకుపోయిన కండరాలను సడలింపజేసి సక్రమంగా నడిచేలా చేయవచ్చని వివరించారు. బిగుసుకుపోయిన కండరాలకు ఆధునిక పద్ధతుల్లో ఒకే శస్త్రచికిత్స ద్వారా సరిచేసి, మెరుగ్గా నడవగలిగేలా చెయ్యవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి.రమేష్, వైద్యులు డాక్టర్ విశ్వేశ్వరరావు, పీడియాట్రిషియన్ డాక్టర్ శ్వేత, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రమ్య పాల్గొన్నారు.










