* కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ : అఖిల భారత స్థాయిలో మెడికల్, డెంటల్ యుజి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్ పరీక్ష సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. ఈ పరీక్షను ఆగస్టు 1 నిర్వహిస్తామని కేంద్రం ఇంతకుముందు పేర్కొన్న విషయం తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ఈ పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేందుకు పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు వెల్లడించారు. గతేడాది 3,862గా ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచుతామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్క్‌లు అందజేయడంతోపాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కరోనా నేపథ్యంలో అనేక పాఠశాలల బోర్డులు సిలబస్‌ను 30 శాతం వరకు తగ్గించిన నేపథ్యంలో.. ఇందుకు అనుగుణంగా నీట్ సిలబస్ తగ్గింపుపై లేదా ప్రశ్నాపత్రంలో ఎక్కువ ఛాయిస్‌లు కల్పించడంపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. గతేడాది కూడా కరోనా ఉధృతి నేపథ్యంలో సెప్టెంబర్‌లో నీట్ పరీక్ష నిర్వహించిన కేంద్రం, ఆ సమయంలో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు తిరిగి అక్టోబర్‌లో అవకాశం కల్పించింది.










