ఖాట్మాండు : రెండు రోజుల్లో దేశ నూతన ప్రధానిగా నేపాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహుదూర్ దేవుబాను నియమించాలని ప్రెసిడెంట్ బిద్యాదేవీ భండారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐదు నెలల వ్యవధిలో రెండు సార్లు రద్దైన ప్రతినిధుల సభను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. జస్టిస్ చోలేంద్ర షమ్‌షేర్ రానా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో గత ప్రధాని కెపి శర్మ ఓలీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది. ఓలీ సిఫార్సు మేరకు 275 సభ్యుల గల దిగువ సభను మే 22న నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవీ భండారి రద్దు చేశారు. ఐదు నెలల వ్యవధిలో ప్రతినిధుల సభను రద్దు చేయడం ఇది రెండవ సారి. నవంబర్ 12, 19 ఎన్నికలను కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మధ్యంతర ఎన్నికల కోసం గత వారమే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. అయితే దిగువ సభను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహుదూర్‌తో పాటు 146 మంది ప్రజా ప్రతినిధులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. షేర్ బహుదూర్‌ను ప్రధానిగా నియమించాలని, ప్రతినిధుల సభను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జులై 5న గంటల పాటు విచారణ చేపట్టిన కోర్టు జులై 12కు తీర్పు వాయిదా వేసింది. ఇక జులై 12న ప్రధానిగా షేర్ బహుదూర్‌ను నియమించాలని, ప్రతినిధుల సభను పునరుద్ధరించాలని తీర్పునిచ్చింది.










