ప్రజాశక్తి -కందుకూరు :సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకుండా విధులకు డుమ్మా కొడు తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 11, 13 సచివాలయాల సిబ్బంది బుధవారం 10.30 గంటల తర్వాత కూడా విధులకు రాకపోవడంతో ఖాళీ కుర్చీలతో ఉన్న కార్యాలయాన్ని వెంకట్రాద్రి పాలెంకు చెందిన వైసిపి నాయకుడు జిల్లాలమూడి వెంకటేశ్వర్లు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోతే ప్రజలకు మేలు ఎలా జరుగుతుందని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించడం కనిపించింది. కొంత సమయం తర్వాత మళ్లీ కార్యాలయానికి వెళ్లి అడగ్గా అక్కడ ఒక్కరు మాత్రమే విధుల్లో ఉండగా మిగిలిన వారు హాజరు వేయించుకొని సొంత పనిపై బయటకు వెళ్లారని చెప్పినట్లు వెంకటేశ్వర్లు మరో పోస్టింగ్ పెట్టారు.కొన్ని సచివాలయాల్లో అయితే ప్రజల వద్ద లంచాలు కూడా తీసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ స్పందించి సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.










