Feb 01,2023 22:31

సచివాలయం వద్ద పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు

ప్రజాశక్తి రొద్దం:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటివద్దకే పింఛన్లు పంపిణీ కార్యక్రమం రొద్దం మండలంలో అమలు కాలేదు. మండలంలోని ఎం. కొత్తపల్లి సచివాలయం వద్దనే పింఛన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయం పరిధిలో ఉన్న నాలుగు వాలెంటీర్ల పోస్టులు ఖాళీ కావటంతో సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎం.కొత్తపల్లి గ్రామంలో ఇద్దరు, తోడంగి పల్లి గ్రామంలో ఇద్దరు వాలెంటీర్లు వదిలేయడంతో ఎం. కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఇద్దరు వాలెంటీర్ల కింద ఉన్న దాదాపు 100 కుటుంబాల్లో ఉన్న పింఛనుదారులు ఆరు నెలలుగా సచివాలయం వద్దకే వచ్చి పింఛన్లు తీసుకు వెళ్తున్నారు. నడవడం చేతకాని వికలాంగులు, వృద్ధులు ఈ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇళ్లవద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్నప్పుడు ఎలాంటి సమస్య ఉండేది కాదని అన్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న వాలెంటీర్ల పోస్టులను భర్తీ చేసి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.