ప్రజాశక్తి-విజయవాడ:
వార్డు సచివాలయ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీర్చాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. పున్నమ్మతోట 85,86,87 వార్డు సచివాలయాలను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ వార్డు సచివాలయాలు ప్రజలసమస్యల పరిష్కారానికి దిక్సూచిలాంటివని పారదర్శకమైన సేవలందించి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశాలను నెరవేర్చాలని కలెక్టర్ అన్నారు. వార్డు విద్యా కార్యదర్శి ఆయా వార్డు పరిధిలో పాఠశాలలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత, మెను పరిశీలించాలన్నారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలను ప్రథకాల వారీగా వార్డులలో సచివాలయ నోటీసు బోర్డులలో ప్రదర్శించాలని, అదేవిధంగా అనర్హుల జాబితాలను, అనర్హతకు గల కారణాలను కూడా తెలియజేస్తూ నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు.
వైద్యాధికారులు రోగులకు అందుబాటులో ఉండాలి
జిల్లా మలేరియా కార్యాలయంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ డిల్లీరావు పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ వేయించాలన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారులు రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ వెన్నెల శ్రీనివాసరావు ఉన్నారు.










