Jan 01,2023 09:19

చైర్‌పర్సన్‌ పోడియం ముందు ఆందోళన చేస్తున్న టిడిపి కౌన్సిలర్లు

         హిందూపురం: పురపాలక సంఘం వ్యాప్తంగా సచివాలయాలకు అనుసంధానంగా కన్వీనర్లను నియమించడం విడ్డూరంగానూ, అప్రజాస్వామికంగా ఉందని టిడిపి కౌన్సిలర్లు ఆరోపించారు. శనివారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్‌ సర్వసభ్వ సమావేశం జరిగింది. అధికారులు 25 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా కౌన్సిలర్‌ ఆసీఫ్‌ మాట్లాడుతు జిల్లాలోనే అతి పెద్ద ఆట మైదానం ఎంజిఎం పాఠశాల మైదానం అన్నారు. దీనిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకుండా అభివృద్ది చేయాలన్నారు. దీనిపై ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ స్పందిసూత ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలా మైదానాన్ని అభివృద్ది చేస్తామన్నారు. మరో అంశంపై ఆసీఫ్‌ మాట్లాడుతూ పట్టణంలోని ఆర్‌పిజిటి రోడ్డులో సుమారు రూ.2కోట్ల విలువజేసే మున్సిపల్‌ రిజర్వు స్థలం అన్యాక్రాంతం అవుతోందన్నారు. దీనిని పరిరక్షించి, ఇందులో ఉద్యానవనం ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుందని సూచించారు. దీనిపై స్పందించిన ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ మాట్లాడుతూ పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్నా రిజర్వు స్థలాలను గురించి, వాటిని పరీరక్షించాలని టౌన్‌ప్లానింగ్‌ ఎసిపి ఆనంద కుమార్‌కు ఆదేశించారు. సమావేశం జరుగుతున్న సమయంలో టిడిపి కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సచివాలయాలకు కన్వీనర్లను ఏర్పాటు చేయొద్దని నినదాలు చేశారు. అయినప్పటికీ అజెండాలోని అంశాలపై కనీస చర్చ సైతం లేకుండా నెంబర్లు చదువుతూ అజెండాను ఆమోదించారు. ఈ సందర్బంగా టిడిపి కౌన్సిలర్లు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగాన్ని ఉల్లఘించి ప్రభుత్వ కార్యలయాలకు అనుసందానంగా కన్వీనర్ల నియామకం చేస్తున్నారని ఇది సరికాదన్నారు. తొలగించిన పింఛన్లను తక్షణం పునరుద్ధరించాలన్నారు. ఈ సమావేశంలో వైస్‌ ఛైర్మన్‌ జబీవుల్లా, ఇన్‌ఛార్జి కమిషనర్‌ హరిబాబుతో పాటు అన్ని విభాగాల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.