మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్
సచివాలయ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
- కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్
నెల్లూరు :నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హరిత ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక 46/2 కాపువీధి సచివాలయాన్ని కమిషనర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో అందిస్తున్న వివిధ సంక్షేమ పధకాల అమలు తీరును పరిశీలించి, సూచించిన గడువులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డు ప్లానింగ్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన కమిషనర్, వార్డు అడ్మిన్, వి.ఆర్.ఓ కార్యదర్శుల పనితీరుపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో ఓటుకు ఆధార్ లింక్ చేసే కార్యక్రమాన్ని పటిష్టంగా పూర్తి చేయాలని సూచించారు. వలంటీర్ల ద్వారా అర్హులైన అందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు మంజూరు చేయించాలని సూచించారు. వలంటీరు పరిధిలోని ప్రజల అనారోగ్యాలకు సంభందించిన వివరాలు, వారికి అందిస్తున్న చికిత్స గురించి ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్ లో పొందుపరచాలన్నారు. సిటిజెన్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలను అర్హులైన ప్రజలకు మరింత చేరువ చేయాలని కమిషనర్ సూచించారు.










