సచివాలయ సిబ్బందికి రెగ్యులర్ టైం స్కేల్ ఇవ్వాలి
ప్రజాశక్తి-కలిగిరి : గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు అందరికీ రెగ్యులర్ టైం స్కేల్ ఇవ్వాలనీ పిడిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలిగిరిలో ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సచివాలయం ఉద్యోగులకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పరీక్షల పేరుతో 2సంవత్సరాల 9 నెలలు సర్వీస్ పూర్తి చేసినా, వారికి రెగ్యులర్ టైం స్కేల్ ఇవ్వకపోవడం గర్హణీయమన్నారు. రెండు సంవత్సరాల ప్రొబేషనరీ కాలంలో రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా వారికి ఆర్థిక నష్టం చెయ్యడం ఖండిస్తున్నానని తెలియజేశారు. 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినా సచివాలయం ఉద్యోగులకు ప్రమోషన్ ఛానెల్ ఏమిటో నేటికీ ఉత్తర్వులు ఇవ్వకపోవడం సరికాదన్నారు. జూనియర్ లైన్‌మెన్ విధులు ఎక్కడ నిర్వహించాలో, వారికి సమయపాలన విషయంలో స్పష్టత లేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మహిళ పోలీసులు ఐసిడిసికి చెందుతారా, లేక హోం డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహించాలా స్పష్టత లేదన్నారు. గ్రామ సర్వేయర్లతో వెట్టి చాకిరీ చేయిస్తూ రాత్రి 10 గంటల వరకు పని చేయిస్తున్నారని విమర్శించారు. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్లలో 6 డిపార్ట్మెంట్లలో ప్రమోషన్ ఛానెల్ ఏమిటో ఎవరికీ తెలియదన్నారు. వార్డు శానిటరీ సెక్రటరీ నిర్థిష్ట పని వేళలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ -5 వారికి డిడిఒ అధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించారు కానీ ఆచరణలో లేదన్నారు. మీ సర్వీస్ విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఈ సమస్యల పరిష్కారం కోసం తాను చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలియజేశారు. కావున సచివాలయం గ్రాడ్యుయేట్ ఉద్యోగులు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.










