సబ్ స్టేషన్ వద్ద టిడిపి నేతల ధర్నా
ప్రజాశక్తి-సీతారామపురం : పేద ప్రజల నడ్డి విరుస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మండల టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల టిడిపి కన్వీనర్ కప్పా ప్రభాకర్ రాజు ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు సంవత్సరాలలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత వైసిపికే దక్కుతుందని, పేదలపై సుమారు రూ.56 వేల కోట్ల భారాన్ని మోపి పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వంగా వైసిపి ప్రభుత్వం నిలిచిందన్నారు. పేదలపై కోట్ల రూపాయల భారాన్ని వసూలు చేసి తిరిగి వాళ్లకే ఇచ్చి తానేదో ఉద్ధరిస్తున్నానని గొప్పలు చెప్పుకోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందని, పది లక్షల ఎకరాల భూ కబ్జా పనిలో భాగంగా ఎంఒయులు చేసుకోమని చెప్పి అడ్డదారిలో ఆదాయం పొందాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని ఎస్‌సి ఎస్‌టిలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందజేసారనీ గుర్తుచేస్తూ అలాంటిది ప్రస్తుత ప్రభుత్వం ఉచిత విద్యుత్తును ఎత్తేసి పేదలపై భారం మోపుతుందన్నారు. పేదలను ఇబ్బంది పెట్టే ప్రతి చర్యలపై టిడిపి తరఫున ఖండిస్తున్నామన్నారు. గతంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్తు కీëఆర్జీలు పెంచి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిలిచారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భయంకరమైన పాలన జరుగుతుందని ప్రతి వస్తువును పెంచి పేదలను నిండా ముంచుతున్నారన్నారు. ఇలాగే కొనసాగితే వైసిపికి 2024లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలనే ప్రయత్నంలో రాష్ట్రప్రభుత్వం ఉందని ఆ విధానం వల్ల రైతులకు తీవ్రనష్టం ఏర్పడుతుందన్నారు. పంపుసెట్లకు మీటర్లు బిగించడం వల్ల రైతులకు వ్యవసాయం చేయడం కష్టతరమవుతుందన్నారు. ఇప్పటికే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి వలస వెళ్తున్నారని అటువంటి సందర్భంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే పూర్తిగా వ్యవసాయం కనుమరుగవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి కలివెల జ్యోతి, సీనియర్ నాయకుడు నేలటూరి జాషువా, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సింగాల నాగేశ్వరరావు, తురక వెంకటేశ్వర్లు, ఇజ్రాయిల్, ప్రవీణ్, సుమన్, రాజేష్, కిరణ్, ఖాజా మొహిద్దిన్, పెద్ద గౌస్, జయరాములు, బాబు, తదితరులు పాల్గొన్నారు.










