ప్రజాశక్తి-హిందూపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో నూతనంగా నిర్మించిన వాణిజ్య భవన సముదా యంలో సౌకర్యాలు కల్పిస్తామని, వెంటనే ఖాళీ చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ సూచించారు. గురువారం పట్టణంలోని పశువర్ధక శాఖ డిడి కార్యాలయ ఆవరణలో పూలవ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్కెట్ నిర్మాణం పూర్తయి ప్రారంభమైనప్పటికీ వ్యాపారులు దుకాణాలను మార్చలేదన్నారు. వెంటనే ఖాళీ చేయాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో వ్యాపారులు పూలను రోడ్డుపై పడేసి ఆందోళన చేశారు. అనంతరం ఎమ్మెల్సీ నివాస గృహానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చి, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తోపాటు వైస్ ఛైర్మన్ జబీవుల్లాలను కలిసి సమస్యను వివరించారు. తమకు కేటాయించిన స్థలంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతోనే ఇప్పటి వరకు మార్కెట్‌లో లావాదేవీలు చేసుకోలేకపోతున్నామనానరు. సౌకర్యాలు కల్పిస్తే వెంటనే మార్కెట్‌లో వ్యాపారాలు చేస్తామని వివరించారు. ఇందుకు ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన మార్కెట్‌లో పూల వ్యాపారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. అయితే పశువర్ధక శాఖ అధికారులతో చర్చించి మరో రెండు నెలలు గడువు ఇచ్చించాలని వ్యాపారులు కోరగా ఇప్పటికే చాలాసార్లు వారితో గడువు ఇప్పించామని, రూ.కోట్లు ఖర్చు చేసి మార్కెట్ నిర్మిస్తే వ్యాపారులు చేసుకోకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సౌకర్యాలు కల్పిస్తాం..ఖాళీ చేయండి..










