Jan 06,2023 21:24

ఆందోళనకారులతో చర్చిస్తున్న పోలీసులు

           ప్రజాశక్తి-హిందూపురం   ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్యం అందించలేనప్పుడు ఆసుపత్రిని మూసేయాలని రోగుల బంధువులు కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ను నిలదీశారు. శుక్రవారం స్థానిక జిల్లా అసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న అమరాపురం మండలం కె.శివరాం గ్రామానికి చెందిన రోగుల బంధువులు రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఆసుపత్రిలో కొద్దిసేపు హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న సిఐలు ఇస్మాయిల్‌, వెంకటేశ్వర్లు, సిబ్బందితో చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అయినా వినకుండా కలెక్టర్‌ బయటకు రావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రోగుల బంధువులు మాట్లాడుతూ అమరాపురం మండలం కె.శివరాం గ్రామానికి చెందిన 26 మంది కూలీలు గురువారం ఉదయం ట్రాక్టర్‌లో కూలి పనులకు వెళ్తూ బోల్తా పడిన ఘటనలో గాయపడి మెరుగైన చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చామన్నారు. వీరిలో ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రులకు తరలించారని, మిగతావారు ఇక్కడే ఉన్నారన్నార. వీరందరికీ 24 గంటలు గడుస్తున్నా వైద్యులు మెరగైన వైద్యం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్‌కు వివరించడానికి వస్తే అడ్డుకుంటున్నారన్నారు. ఎట్టకేలకూ పోలీసులు కలెక్టర్‌తో మాట్లాడేందుకు ఇద్దరికి అనుమతిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో మాట్లాడుతూ స్థానిక వైద్యులు మెరుగైన వైద్యం అందించకపోగా సిటీ స్కానింగ్‌ అని బయటకు రాసి ఇస్తున్నారన్నారు. సీటి స్కాన్‌ చేయడానికి బయట రూ.8వేలు అడుగుతున్నారని, కూలీ పని చేసుకునే తమకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని వాపోయారు. ఇందుకు స్పందించిన కలెక్టర్‌ వెంటనే రోగుల కే షీట్‌లు తెప్పించి పరిశీలించారు. అనంతరం వైద్యులతో మాట్లాడుతుండగా రోగుల బంధువులు మాట్లాడేందుక యత్నించారు. వారి మాటలు కలెక్టర్‌ వినకపోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం కలెక్టర్‌ స్పందిస్తూ ఎవరూ ఆధైర్యపడకండని, అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశం అనంతరం ప్రమాదంలో గాయాపడి చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్‌ పరామర్శించారు. ఘటనపై ప్రజాశక్తి కలెక్టర్‌ను వివరణ కోరగా ప్రమాదం జరిగిన తీరును సంబంధిత మండల తహశీల్దార్‌తో నివేదిక తెప్పించుకుని చూసి మృతిచెందిన వ్యక్తికి ప్రమాద బీమా ఉంటే రూ.5లక్షలు వెంటనే మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.