- మధ్యాహ్నాం వరకే ఆసుపత్రి సిబ్బంది
- ఐరన్ మాత్రలకు చెదులు
- నిర్లక్ష్యంగా వైద్యుల పనితీరు
- నిద్రమత్తులో ఉన్నతాధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
ప్రజాశక్తి-వాల్మీకిపురం
మండలంలోని నగరిమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు మెండుగా ఉన్నా.. వైద్యుల నిర్లక్ష్యం వలన వైద్య సేవలకు అస్వస్థత చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. మధ్యాహ్నాం పిహెచ్‌సికి తాళాలు వేసుకొని వెళ్లిపోతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ ఒపి కూడా రోజుకి 60 నుంచి 80 వరకు మాత్రమే వస్తుందని, వైద్యుల పనితీరు మెరుగ్గా ఉంటే మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. పిహెచ్‌సిలో సౌకర్యాలకు కొదవ లేకుండా కాన్పులగది, ఆపరేషన్ థియేటర్, స్త్రీలకు, పురుషులకు వార్డులు, ల్యాబ్‌లు ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇద్దరు వైద్యులు, ఏడు మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఆసుపత్రి వైద్యులుగానీ, సిబ్బందిగానీ సమయపాలన పాటించరనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. గ్రామస్థులకు జబ్బు చేస్తే సుమారు 10కిలో మీటర్ల దూరంలో ఉన్న చింతపర్తి పిహెచ్‌సికి లేదా వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి రావాల్సి వుంటుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరిమడుగులో పని చేసే ఓ ఉద్యోగి వాల్మీకిపురంలో ఉంటారని, పంచాయతీ కార్యాలయం, టీస్టాల్‌లో కాలయాపన చేస్తూ.. మధ్యాహ్నాం 3 గంటలు అయితే ఇంటికి వెళ్లిపోతారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో ఎవ్వరూ లేకపోవడంతో ఆసుపత్రిలోని కుర్చీలు, బెడ్లు అన్నీ దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి.
మధ్యాహ్నాం వరకే ఆసుపత్రి : నగరిమడుగు పిహెచ్‌సి రోజు మధ్యాహ్నాం వరకు మాత్రమే పని చేస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజు రావడం మధ్యాహ్నాం వరకు ఉండడం, మధ్యాహ్నాం అయితే ఆసుపత్రికి తాళాలు వేసుకొని వెళ్లిపోతారని గ్రామస్థులు చెబుతున్నారు.
నిర్లక్ష్యంగా వైద్యుల పని తీరు : వైద్యులు సైతం ఆసుపత్రిలో ఉండరని, ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఇద్దరు సక్రమంగా పని చెయ్యరనే ఆరోపణలు అనేకం.
మాత్రలకు చెదులు : పిహెచ్‌సిలో ఉన్న మాత్రలకు చెదులు పట్టడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి ఇలాంటి మాత్రలే ఇస్తారని అని మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వలనే ఇక్కడ సిబ్బంది పని తీరు సక్రమంగా ఉండడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
నిద్రమత్తులో ఉన్నతాధికారులు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసే ఉన్నతాధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో ఇక్కడ వైద్యుల పనితీరు సక్రమంగా ఉండడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పిహెచ్‌సిలను తనిఖీ చేసి, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మధ్యాహ్నాం వరకే ఉంటారు
నగిరిమడుగు ఆసుపత్రిలో అందరూ మధ్యాహ్నాం వరకు ఉంటారు. మళ్లీ మధ్యాహ్నాం వచ్చే బస్సులో అందరూ ఆసుపత్రికి తాళాలు వేసుకొని వెళ్లిపోతారు. ఎవరికైనా జబ్బు చేస్తే వాయల్పాడుకు పోవాలి. ఇక్కడ డాక్టర్లు, సిబ్బంది సక్రమంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-వెంకట్రమణ, గ్రామస్తుడు, నగిరిమడుగు, వాల్మీకిపురం.










