ప్రజాశక్తి -కందుకూరు : వైసిపి పరిపాలనలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి వెళ్లిందని, సైకో పాలన పోయి మళ్లీ సైకిల్ పాలన మళ్లీ వస్తేనే ప్రజల బతుకులు బాగుపడతాయని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా, పట్టణంలోని 6వ వార్డులో ఇంటూరి నాగేశ్వరరావు, ఇతర నాయ కులు శనివారం పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేశారు. వార్డులో సమస్యలు తెలుసుకున్నారు. ముస్లిం పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై పార్టీ నేతలకు స్వాగతం పలికారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీల అభివద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రంజాన్ పండుగకు చంద్రన్న తోఫా, సబ్సిడీ రుణాలు, షాది మహల్ నిర్మాణాలు, పేద ముస్లింల బిడ్డలకు విదేశీ విద్య లాంటి ఉపయోగకరమైన పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా లోకేష్ పాదయాత్ర దిగ్విజయమవుతుందని నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు దివి శివరాం మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు అద్భుతమైన స్పందన వస్తుందని తెలిపారు. అనంతరం వార్డులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన
కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు అహ్మద్ బాషా, నియోజకవర్గ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్, నియోజకవర్గ ఐటీడీపీ కోఆర్డినేటర్ షేక్ మున్నా, వార్డు నాయకులు షేక్ నాయబ్ రసూల్, సయ్యద్ సలీం, రాష్ట్ర కమిటీ నాయకులు షేక్ రఫీ, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, పార్లమెంట్ కమిటీ నాయకులు బత్తిన ఆదెమ్మ, పసుపులేటి శ్రీనివాసులు, నియోజకవర్గ కమిటీ నాయకులు నాదెండ్ల వెంకట సుబ్బారావు, పట్టణ కమిటీ నాయకులు షేక్ సలాం, ముచ్చు లక్ష్మీరాజ్యం, కల్లూరి శైలజ, పులి నాగరాజు ఉన్నారు.










