Mar 20,2022 07:47

పదకొండేళ్ల వయసులో ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు మల్లు స్వరాజ్యం. అన్నయ్య ప్రేరణతో, అమ్మ నవల ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల తరఫున పనిచేయటమే తన ఆశయంగా ఎంచుకున్నారు. ఆఖరి శ్వాస వరకూ అదే బాటలో నడిచారు. ఎర్రజెండాకు వన్నె తెచ్చారు. ఎన్నో ఉద్యమాల్లో, పోరాటాల్లో అలుపెరగని భాగస్వామ్యం వహించారు.
    మల్లు స్వరాజ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కర్విరాల కొత్తగూడెంలో 1931లో జన్మించారు. తల్లిదండ్రులు బీంరెడ్డి చొక్కమ్మ, రాంరెడ్డి. వీరిది భూస్వామ్య కుటుంబం. ఆమె తోబుట్టువులు భీంరెడ్డి నర్సింహరెడ్డి, భీంరెడ్డి కుశలవరెడ్డి పేదల తరఫున ఉండేవారు. వారి మాటలు, కార్యకలాపాలూ ఆమెను ఎంతగానో ఉత్తేజపరిచాయి. అన్నతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. స్త్రీలు గడపదాటడమే గగనంగా ఉన్న నాటి రోజుల్లో ఊరురా తిరిగి పాటలు పాడుతూ.. ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించారు స్వరాజ్యం. సాయుధ పోరాటం విరమణ తర్వాత ఉద్యమ సహచరుడు మల్లు వెంకట నర్సింహారెడ్డితో 1954 మేలో ఆమె వివాహం జరిగింది. నాటి కమ్యూనిస్టు నేతలు బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు పెళ్లి పెద్దలుగా ఉన్నారు. ఎటువంటి ఆర్భాటాలూ లేకుండా దండల మార్పుతో వివాహం జరిపించారు. దంపతులు ఇద్దరూ జీవితాంతం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు. వారి కుటుంబమూ కమ్యూనిస్టు ఉద్యమానికి అండదండలనిచ్చి నిలిచింది.
     స్వరాజ్యం రెండుసార్లు తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. మహిళా ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర వహించారు. ఎప్పుడూ నిరాడంబరంగానే ఉండేవారు. వృద్ధాప్యంతో ఆసుపత్రిలో చేరాక కూడా కూడా ఆమె ఎర్రజెండా గురించే ఆలోచించేవారు. పిడికిలి బిగించి .. చేయి పైకెత్తి ఉద్యమ మిత్రులకు ఉత్తేజం పంచేవారు. కమ్యూనిస్టు పార్టీతోనే సమాజంలో అందరికీ మేలు జరుగుతుందని, అన్ని అంతరాలూ సమసిపోతాయని అనేవారు. పలు సందర్భాల్లో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉండేవి. ఆ భావనల సారాంశం ఆమె మాటల్లోనే ...
     ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న కాలంలో నేను పుట్టాను. మా మేనత్త కొడుకు ఆ ఉద్యమంలో పాల్గొని వచ్చి అక్కడ జరిగిన విశేషాలు మా అమ్మకు చెప్పాడు. ఆ స్ఫూర్తితో మా అమ్మ ఆడపిల్లలు స్వేచ్ఛగా చదువుకోవాలి, స్వేచ్ఛగా బతకాలి అని కోరుకుంది. అందుకే నాకు స్వరాజ్యం అని పేరు పెట్టింది. ఆనాడు స్త్రీలను పరదాల చాటున ఉంచుతున్నారనే ఉద్దేశంతో స్త్రీలకు స్వేచ్ఛ కావాలని కోరుకుంది.
    అన్నయ్య ఇచ్చిన ప్రేరణతో మాక్సిమ్‌ గోర్కి 'అమ్మ' నవల చదివి 13 ఏళ్ల వయసులో ఉద్యమంలోకి వచ్చాను. అప్పట్లో స్త్రీలకు స్వేచ్ఛలేదు, చదువు లేదు. అందుకే మహిళలకు చదువు కావాలి, అభివృద్ధి కావాలని కోరుకున్నాను. అప్పుడే ఆంధ్ర మహిళా సభ బాల్యవివాహాలను వ్యతిరేకించింది. వితంతు వివాహాలను ప్రోత్సహించింది. బాలికలకు చదువు అవసరమని ప్రచారం చేసింది. తర్వాత దీన్నే కమ్యూనిస్టులు కొనసాగించారు. సోవియట్‌ రష్యాలో ప్రజలు, మహిళలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో తెలిసి, ప్రభావం కూడా మాపై పడింది. దీని ఫలితంగానే నాలాంటి ఎందరో మహిళలు ఉద్యమాల్లోకి వచ్చారు.
     స్త్రీలను నాలుగ్గోడల మధ్య ఉంచడానికి వ్యతిరేకంగా, స్త్రీలకు స్వేచ్ఛ కావాలని కోరుతూ మహిళలు వీధుల్లోకి వచ్చారు. అరెస్టులు చేయబడి, జైళ్ళకు వెళ్ళారు. వారు ప్రదర్శించిన ధైర్య సాహసాల ఫలితంగానే మనకు హక్కులు సాధ్యమయ్యాయి. ఓటుహక్కు వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటంలో పోలీసులు మగవాళ్ళను పట్టుకెళితే స్త్రీలే భూమిని దున్ని పండించారు. ఐలమ్మ భూ పోరాటమే దీనికి నిదర్శనం. అలాంటి మహిళలను పక్కన పెడితే ఉద్యమాలు లేవు. సంపూర్ణ అభివృద్ధీ సాధ్యం కాదు. 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలితాలు ఇంకా స్త్రీలకు సంపూర్ణంగా దక్కలేదన్నది నిజం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా స్త్రీలు కోరుకున్న సమాజం రాలేదు. అది రావాలంటే మహిళలు చైతన్యంతో సంఘటితంగా పోరాడాలి. ఆ లక్ష్యమైతే ఇంకా చేరాల్సి ఉంది. అప్పట్లో మహిళలను సమరశీల రాజకీయాల్లోకి తెచ్చింది కమ్యూనిస్టులు. మహిళలను ఎన్నికల్లో పోటీ చేయించింది కమ్యూనిస్టులే. నేనూ అలా వచ్చిన దాన్నే. అంబేద్కర్‌ రాజ్యాంగంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరినా పాలకులు మహిళలకు దక్కాల్సిన హక్కులను దక్కనీయలేదు. లాభాల కోసం పాకులాడే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను రూపు మాపకుండా మహిళలకు స్వేచ్ఛ రాదన్నది నిజం. నా ఉద్దేశంలో స్త్రీలకు, దళితులకు స్వేచ్ఛ రాకుండా దేశానికి స్వతంత్రం రానట్టే !
     ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మహిళలు చేయని పనంటూ లేదు. అయితే కొందరు కేవలం సొంత లాభం, సొంత కెరీర్‌ అంతా తమ సొంతం కోసమే ఆలోచిస్తున్నారు. ఇతరుల గురించి, సమాజం గురించి ఆలోచించ లేకపోతున్నారు. ఈ వ్యవస్థ కూడా వారిని అలాగే తయారు చేస్తోంది. మహిళలు సమాజం గురించి ఆలోచించకుండా, రాజకీయాల్లోకి, పాలనలోకి రాకుండా స్వేచ్ఛ లభించదు. పూర్తి అభివృద్ధి సాధ్యం కాదు. దేశంలో 30 శాతం మంది సమాజం కోసం ఆలోచించినా మార్పు కచ్చితంగా వస్తుంది. ఇది నా అనుభవంతో చెబుతున్న మాట. ఆనాడు వీర తెలంగాణ పోరాటంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడి నిరూపించాం. వ్యక్తిగత పోరాటాల వల్ల సమాజం మారదు. సమాజంలో సగభాగమైన స్త్రీలు సాధికారతను సాధించాలంటే సామూహికంగా పోరాడాలి. ఆడపిల్లకు చదువు, పెళ్ళి విషయంలో నిర్ణయం తీసుకున్న హక్కు రావాలి. ఇది సాధించాలంటే రాజకీయ, ఆర్థిక పోరాటాలే శరణ్యం.