Dec 07,2022 22:24

వీరజవాను కుటుంబసభ్యుడిని సన్మానిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి.పుట్టపర్తి అర్బన్‌ : దేశానికి సేవ చేయడంలో సాయుధ దళాల సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖకు తన వంతు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ సేవలో, రక్షణలో సాయుధ దళాల సేవలు కీలకమన్నారు. మాజీ సైనికుల సంక్షేమ కోసం ప్రత్యేక నిధికి విరాళాలు ఉదారంగా అందిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో వీరమరణం పొందిన వారికి అందించే సైనిక సంక్షేమ శాఖ గోడ పత్రికలను కలెక్టర్‌ విడుదల చేశారు. వీరమరణం పొందిన వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. రాచయ్య, ఆ శాఖ సిబ్బంది, వీర మరణం పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.