- పద్మావతి ఘాట్‌పై ఔట్‌ఫాల్ డ్రెయిన్ పనులపై ఎన్నో సందేహాలు
- నెల రోజులుగా పైపులైన్ల క్లియరెన్స్, మూడు మ్యాన్‌హోల్స్ పిట్లు నిర్మాణం
.ప్రజాశక్తి-విజయవాడ: కృష్ణలంక 22వ డివిజన్ భ్రమరాంబపురంను ముంచెత్తుతున్న ఔట్‌ఫాల్ డ్రైన్‌కు సంబంధించి పద్మావతి ఘాట్‌పై జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల వల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చనని స్థానిక ప్రజలతో పాటు ప్రజారోగ్య విభాగం అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమస్య శాశ్వత పరిష్కారం దిశగా కాకుండా ఏదో చేశామని చేతులు దులుపుకునే పని చేస్తే డబ్బులు వృధా అయ్యే అవకాశముంది. అధికారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం చేసే పనుల వల్ల యుజిడి, ఇతర మురుగునీటి కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారై ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయే పరిస్థితి ఉంది. చిన్నపాటి వర్షం వచ్చినా డివిజన్ మొత్తం ముంపుకు గురవుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఔట్‌ఫాల్ డ్రైయిన్ నుంచి నదిలోకి మురుగునీటిని పంపించడానికి పద్మావతి ఘాట్ కింద భూగర్భంలో 2016లో భూగర్భంలో అమర్చిన పైపులైన్ పూర్తిగా చెత్తాచెదారం, వ్యర్ధాలతో నిండిపోయింది. పూడిపోయిన పైప్‌లైన్‌ను క్లియర్ చేసి, భవిష్యత్‌లో ఇటువంటి సమస్య ఎదురు కాకుండా నదిలోకి ఔట్‌ఫాల్ డ్రైయిన్ ద్వారా మురుగునీరు సాఫిగా వెళ్లిపోయేలా చూడాలి. ఇందుకు విఎంసి జనరల్ ఫండ్ నుంచి రూ.8 లక్షలు కేటాయించి సర్కిల్-3 పరిధిలోని ఇంజినీరింగ్ అధికారులు పనులు చేయిస్తున్నారు. పద్మావతి ఘాట్ పరిధిలో సిసి పైప్‌లైన్‌లో భారీ మొత్తంలో పేరుకుపోయిన షిల్టు, చెత్తాచెదారం, ఇతర వ్యర్ధాలను తొలగించడం, ఘాట్‌పై మధ్యమధ్యలో మూడు మ్యాన్‌హోల్ పిట్లు నిర్మాణం పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. దాదాపు నెలరోజుల నుంచి జరుగుతున్న ఈ వర్క్ ఎప్పటికీ పూర్తవుతుందో ప్రశ్నార్థకంగా తయారైంది. పిట్లుకు సంబంధించి మ్యాన్‌హక్షల్ కోసం ఘాట్‌పై ప్రొక్లెయిన్ ద్వారా తవ్వి పడేసిన కాంక్రీట్ వేస్ట్, మట్టి కొండల్లా పడేశారు. దానిని అక్కడ నుంచి తొలగించకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ మట్టికుప్పలు కాస్త కొట్టుకుపోయి, ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న పిట్లు, ఘాట్ మొత్తం నిండిపోయే ప్రమాదం ఉంది. ఈ మట్టి కుప్పలను సత్వరమే అక్కడ నుంచి తరలించాల్సి ఉంది. స్వర్గపురి వైపు ఉన్న ఔట్‌పాల్ డ్రైన్ నుంచి నదిలోకి మురుగునీటిని పంపించడానికి ఘాట్ కింద భూగర్భంలో గత పుష్కరాల నాడు ఆనాటి ఇంజినీరింగ్ అధికారులు చేసిన తప్పిదాలు, హడావుడి పనుల కారణంగా ఎగుడు దిగుడుగా పైప్‌లైన్లు అమర్చారు. దీనిలో చోటుచేసుకున్న సాంకేతిక లోపాన్ని సమగ్రంగా పరిశీలించి, ఆ లోపాన్ని సరిచేసి, శాశ్వత పరిష్కారం దిశగా పైప్‌లైన్ ఏర్పాటు జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిగా ఘాట్‌ను పగలగొట్టి అనుభవం కల్గిన ఇంజినీర్లతో పెద్దపాటి సిసిిపైపులైన్‌ను అమర్చడంతో పాటు లోపలకు చెత్తాచెదారం, వెళ్లకుండా స్వర్గపురి వైపు మెస్‌లాంటిది ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి భారీ మొత్తంలో నిధులను కేటాయించి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పనుల వల్ల శాశ్వత ప్రయోజనం కనిపించకపోగా, మరింత జఠిలమయ్యే ప్రమాదం లేకపోలేదని పలువురు అనుభవం కల్గిన ఇంజినీర్లు, ప్రజారోగ్య విభాగం అధికారులు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు భ్రమరాంబపురం ముంపు నివారణకు శాశ్వత పరిష్కార దిశగా లేకపోగా, దీనికి వెచ్చిస్తున్న లక్షలాది రూపాయల నిధులు వృధా అయినట్లేనని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భ్రమరాంబపురం ఫీడర్ రోడ్డు పక్కన ఉన్న 2వ అడ్డరోడ్డు దగ్గర నుంచి వరుసగా పలు అడ్డరోడ్లలోని డ్రైయిన్లలో ఎక్కడ మురుగునీరు అక్కడే నిలిచిపోతూ దోమలకు ఆవాసంగా తయారై దుర్గంధం వస్తోంది. ప్రతి వర్షాకాలంలో డివిజన్ మొత్తం ముంపుకు గురవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన పద్మావతి ఘాట్‌పై పనులు చేపట్టి, ముంపు నివారణ నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.










