Jun 05,2023 21:26

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జెవివి నాయకులు

కడప అర్బన్‌ : శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జెవివిలో సభ్యులుగా చేరాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం రవీంద్ర నగర్‌ లోని జెవివి కార్యాలయంలో శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర ప్రచార ఉద్యమంలో 35 సంవత్సరాల ప్రస్థానం గల జన విజ్ఞాన వేదిక ప్రజల కోసం సైన్స్‌, ప్రగతి కోసం సైన్స్‌, స్వావలంబన కోసం సైన్స్‌ అనే నినాదంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పనిచేస్తూ ఉండదని తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడి.దేవదత్తం మాట్లాడుతూ మనిషి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే శక్తి మనిషికే ఉందన్నారు. మనం చేసే శాస్త్రీయ ఆలోచన క్రమాన్ని ఆటంకపరిచే శక్తులు, అడ్డుకునే శక్తులు, సామాజిక వ్యవస్థలో ఉన్నాయని చెప్పారు. అలాంటి హేతు విరుద్ధ శక్తుల పట్ల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసే కర్తవ్యం చేస్తున్నది జన విజ్ఞాన వేదికన్నారు. అనేక రంగాలలో మునుపెన్నడూ ఊహించని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్రవ్యాప్త సైన్స్‌ కళాజాతాలను స్వతంత్రంగా జయప్రదంగా నిర్వహించిందని తెలిపారు. తెలుగు ప్రజల భావ విప్లవ పైతాలికుడు కందుకూరి ''ప్రస్తుతం పాత క్రొత్తల మధ్య, సత్యాసత్యముల మధ్య పోరాటం కొనసాగుతుందని చెప్పారు. జనవిజ్ఞాన వేదికలో సభ్యులై ప్రజాసైన్స్‌ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు వెంకటరామరాజు, సమీర్‌బాషా, శ్రీరాములు, ఆరోగ్య విభాగం కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ చక్రధర్‌, నగర కమిటీ అధ్యక్షులు అబ్బాస్‌ వల్లి, జిల్లా కార్యదర్శి రాజేష్‌, నగర్‌ కమిటీ కార్యదర్శి కరీముల్లా పాల్గొన్నారు.