జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్లై
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపట్టడం వలన అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్లై తెలిపారు. స్థానిక పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో బుధవారం గొర్రెల పెంపకందారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు వాడినట్లయితే పెద్ద జీవాలు మృతి చెందవని తెలిపారు. పిల్లల్లో మరణాలు తగ్గినప్పుడే గొర్రెలపెంపకందారునికి అధిక ఆదాయం వస్తుందన్నారు. రైతు భరోసా కేంద్రాల నుంచి పశు వైద్య సహాయకుల సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు. చిట్టుక వ్యాధి, నోటి పుండ్ల వ్యాధి, గిట్ట కుళ్ళు వ్యాధి, బొబ్బరోగము, యాంత్రాక్స్, పారుడు రోగం, గాలి కుంట్ల వ్యాధి, దొమ్మరగానికి సకాలంలో టీకాలు వేసినట్లయితే పెద్ద జీవాలు గానీ పిల్లలు గానీ చనిపోకుండా కాపాడుకుంటామని పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులు తాపించాలని సూచించారు. కార్యక్రమంలో కడప జిల్లా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం అధికారి డాక్టర్ రాజశేఖర్, రాజంపేట డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ ప్రతాప్, సహాయ సంచాలకులు డాక్టర్ కె.డి.వరప్రసాద్, డాక్టర్ సురేష్ రాజు, సహాయ సంచాలకులు, డాక్టర్ శరత్ కుమార్‌రెడ్డి, డాక్టర్ భాగ్యవతి, డాక్టర్ వేదవతి, డాక్టర్ సుదీష్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ రామ సుబ్బారెడ్డి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ జానకి, రాష్ట్ర గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం, ప్యాపిలి, నంద్యాల జిల్లా అధికారులు పాల్గొని గొర్రెల పెంపకం దారులకి సలహాలు, సూచనలు ఇస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.










